ఏపీలో ఎన్ఐఏ సోదాలు ... దివంగత మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే భార్య ఇంట్లో తనిఖీ

Jul 19, 2022, 5:03 PM IST

విజయవాడ : మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న అనుమానంతో విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో కొందరి ఇళ్లపై ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. దివంగత మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే భార్య శిరిష,  విరసం నేత కళ్యాణ్ రావు నివాసంలో ఎన్ఐఏ బృందాలు ఉదయం నుండి తనిఖీలు చేపట్టాయి.  విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్లోని ఓ ఇంట్లోనూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజామున ఒక్కసారిగా  స్ధానిక ఆర్మడ్ రిజర్వ్  ఫోర్స్ సాయంతో ఎన్ఐఏ అధికారులు తనీఖీలు చేపట్టారు. ఈ ప్రాతంనుండి మావోయిస్టులకు నగదు బదీలీలు జరిగినట్లు సమాచారం వుండటంతో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. 

ఇక టంగుటూరు మండలం ఆలకూరపాడులోని దివంగత మావోయిస్టు ఆర్కే భార్య శిరిష ఇంట్లోనూ ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలపై శిరీష స్పందిస్తూ భర్త, కుమారున్ని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వుండగా ఇలా విచారణ, సోదాల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం విజయవాడకు వెళ్లానని... తాను ఇంట్లో లేని సమయంల ఎన్ఐఏ సోదాలు చేపట్టిందని అన్నారు. మావోయిస్టులకు నగదు పంపించినట్లు ఎన్ఐఏ అధికారులకు చేపుతున్నదాంట్లో నిజం లేదని ఆర్కే భార్య శిరీష పేర్కొన్నారు.