Nov 7, 2022, 10:39 AM IST
అమరావతి : పవిత్రమైన కార్తిక మాసం... అందులోనూ ఆ పరమశివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజునే పౌర్ణమి వచ్చింది. దీంతో ఈ కార్తీక పౌర్ణమి రోజుల నదీస్నానాలు చేసి శివనామస్మరణతో ఆ బోళాశంకరున్ని దర్శించుకునేందుకు భక్తులు సిద్దమయ్యారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లోని శివాలయాలు, నదీతీర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున నుంచే కృష్ణానది అన్ని ఘాట్లు పెద్ద ఎత్తున భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఇక కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లాలోని శ్రీ బలచముండికా సమేత అమరేశ్వర స్వామి దేవస్థానానికి భారీగా చేరుకున్న భక్తులు స్వామివారిని పూజించుకుంటున్నారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, అర్చనలు చేస్తున్నారు. ఇక కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. కృష్ణాజిల్లా నాగాయలంక మండలం శ్రీరామప్పక్షేత్రంలో భారీగా భక్తుల సందడి నెలకొంది. కృష్ణా నదిలో పుణ్యస్నాలు ఆచరించడమే కాదు కార్తీక దీపాలు వదిలుతున్నారు భక్తులు.