గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ అరెస్టుపై ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీ మాదిరిగానే కొడాలి నాని, ఆ తర్వాత మరో నాయకుడు అరెస్ట్ అవుతారన్నారు. గన్నవరం తర్వాత గుడివాడ, బందరు ఇలా చాలా నియోజకవర్గాల్లో తప్పులు చేశారని.. తప్పు చేసినవారెవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. వల్లభనేని వంశీ ఏ తప్పూ చేయకపోతే గన్నవరం టీడీపీ ఆఫీస్ దానంతటదే ధ్వంసమైందా అని ప్రశ్నించారు. చట్టం కాస్త ఆలస్యంగా అమలైనా తప్పు చేసినవారు తప్పించుకోలేరన్నారు. అక్రమ కేసులు, కక్షసాధింపు రాజకీయాలు వైసీపీకే సాధ్యమని... పగలు రాంబాబు, రాత్రులు కాంబాబు అయిన అంబటికి డీజీపీ ఎదురొచ్చి స్వాగతం పలకాలా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అటు తన ప్రత్యర్థి, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపైనా విమర్శలు గుప్పించారు. క్రిమినల్ అయిన అబ్బయ్య చౌదరికి అంబటి వత్తాసు పలకడమేంటని ప్రశ్నించారు.