Nov 8, 2022, 10:22 AM IST
శ్రీకాకుళం : తమ స్థలాన్ని కబ్జాచేయకుండా దాయాదులను అడ్డుకునే ప్రయత్నం ఇద్దరు మహిళల ప్రాణాలమీదకు తెచ్చింది. మహిళలన్న జాలి, సాటి మనుషులన్న మానవత్వాన్ని మరిచి అత్యంత అమానుషంగా వ్యవహరించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. పలాస నియోజకవర్గంలోకి మందస మండలం హరిపురం గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు కొట్రదాలమ్మ, సావిత్రిలకు ఇంటిస్థలం విషయంలో దాయాదులతో వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తమస్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ దాయాదుల ఇంటినిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసారు. దీంతో కోపోద్రిక్తులైన కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాష్ రావులు మట్టిలోడ్ ను తల్లీకూతుళ్లపై పోయించారు. దీంతో మహిళలిద్దరూ నడుంలోతు వరకు మట్టిలో కూరుకుపోయి ఆర్దనాదాలు పెట్టారు. అయినా కనికరం చూపకుండా చావండి అంటూ బూతులు తిడుతూ పైశాచికత్వం ప్రదర్శించారు దాయాదులు. మహిళలతో పాశవికంగా వ్యవహరించినవారు మంత్రి సిదిరి అప్పలరాజు అనుచరులని... అందువల్లే ఇంత దాష్టికానికి పాల్పడినా పోలీసులు కనీసం స్పందించడంలేదని అంటున్నారు.