అమరావతిలో ఇదీ రోడ్ల దుస్థితి... రాజధానిలోనే ఇలా వుంటే..: జగన్ సర్కార్ పై వీర్రాజు ధ్వజం

Oct 14, 2022, 3:42 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం రాజధాని అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్ల దుస్థితిని పరిశీలించిన ఆయన రాజధాని ప్రాంతం... అందులోనూ అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు కొలువైన ప్రాంతంలోనే రోడ్ల పరిస్థితి ఇంత అద్వాన్నంగా వుంటే ఇక సాధారణ ప్రాంతాల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రి, విఆర్టి, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీకి వెళ్లే రహదారి గుంతలమయం కావడం జగన్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు వెళ్ళే మార్గాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం దారుణమన్నారు. అమరావతి లో అభివృద్ధి ఆపేసి ఎడారిగా మార్చిన జగన్ ప్రభుత్వం... ఇప్పుడు తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని వీర్రాజు మండిపడ్డారు. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో ఈ విద్యాసంస్థలు ఇక్కడ వెలిసాయని... రాష్ట్రాన్ని నమ్ముకుని వచ్చిన యాజమాన్యాల అన్యాయానికి గురవుతున్నారని వీర్రాజు అన్నారు. కక్ష గట్టి మరీ ఈ విద్యాసంస్థలకు రహదారుల నిర్మాణం చేపట్టడం లేదని తెలిసిందన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో మన రాష్ట్రం గురించి ఏమనుకుంటారో అని కూడా ఈ తోలు మందం‌ ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. పదకొండు కిలోమీటర్ల ఉన్న రోడ్ ను డబుల్ లైన్ గా అభివృద్ధి చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేసారు.