రేపు సూర్యగ్రహణం పట్టనుంది. ఈ సందర్భంగా అన్ని ఆలయాలను మూసివేస్తుండగా ఏపీలోని ఓ ఆలయాన్ని మాత్రం మూసేయరు. ఆ ఆలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా తెరిచే ఉంచుతారు. అదేమిటో తెలుసుకోండి.
చిత్తూరు: గురువారం ఉదయం సూర్యగ్రహణం పట్టనుంది. ఈ ఏడాది చివరి గ్రహణం ఇదే. ఈ గ్రహణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని గుడులన్నీ మూసివేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గుడిని మాత్రం మూసేయరు. ఏ గ్రహణం పట్టినా కూడా ఆ గుడిని మూసేయరు.
అమావాస్య, పౌర్ణమి, గ్రహణాలు, ఇతర ఏ కారణాలతో కూడా మూసేయని గుడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా కొలుస్తారు. దీన్ని గ్రహణం పట్టని ఆలయంగా కూడా పిలుస్తారు.
undefined
రేపు సూర్యగ్రహణం సందర్భంగా కూడా శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఆ ఆలయంలోని శ్రీకాళహస్తీశ్వరుడికి గ్రహణ సమయంలో అభిషేకాలు చేస్తారు. శ్రీకాళహస్తీశ్వరుడు సూర్యచంద్రులు, అగ్ని భట్టారకుడు, నవగ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తుంటాడని, అందువల్ల రాహుల, కేతువు ఈ ఆలయంలోకి ప్రవేశించలేవని విశ్వసిస్తారు.
ఆ కారణంగానే శ్రీకాళహస్తిలో రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటారు. సెలబ్రిటీలు కూడా ఇక్కడ అటువంటి పూజలు చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గ్రహణ సమయంలో కూడా భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. రేపు ఉదయం సూర్యగ్రహణం పట్టిన సమయంలో అభిషేకాలు నిర్వహిస్తారు.