నగరిలో తారాస్థాయికి విభేదాలు: ఎమ్మెల్యే రోజా ఆడియో లీక్

By telugu teamFirst Published Jan 31, 2020, 5:35 PM IST
Highlights

ఎమ్మెల్యే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలోని వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి వైసీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే రోజా చేసిన హెచ్చరికల ఆడియో లీక్ అయింది.

చిత్తూరు: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరిన సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే రోజా ఆడియో ఒక్కటి లీకైంది. ఆ ఆడియో లీక్ లో పార్టీ కార్యకర్తలకు ఆమె హెచ్చరికలు చేసిన విషయాలు పార్టీలోని అంతర్గత విభేదాలను తెలియజేస్తున్నాయి. రోజా ఆడియోలో చేసిన హెచ్చరికలపై ఓ ప్రముఖ టీవీ చానెల్ లో వార్తాకథనం ప్రసారమైంది.

నేరుగా చెప్పకపోయినప్పటికీ వైసీపీ నగరి నేత కేజే కుమార్ షష్టిపూర్తి కార్యక్రమానికి ఎవరూ హాజరు కాకూడదని రోజా హెచ్చరికలు జారీ చేశారు. కేజే కుమార్ పేరును ఆమె నేరుగా ప్రస్తావించలేదు. పార్టీకి ద్రోహం చేసి, తనను వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించినవారి కార్యక్రమాలకు ఎవరూ వెళ్లకూడదని, ఒక వేళ వెళ్తే వారు పార్టీకి దూరమవుతారని ఆమె హెచ్చరించారు.

కేజే కుమార్ షష్ఠిపూర్తి కార్యక్రమానికి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తదితర వైసీపీ నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి రోజాకు మధ్య విభేదాలున్నాయనే మాట వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో రోజాను ఓడించడానికి ఓ వర్గం పనిచేసిందని అంటారు. ఈ విషయంపైనే రోజా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం.

నగరి అభివృద్ధి చెందాలని కోరుకునేవారు తనను వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించినవారి కార్యక్రమాలకు వెళ్లకూడదని ఆమె చెప్పారు. పార్టీకి ద్రోహం చేసి, తనను వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించినవారి కార్యక్రమాలకు ఎవరు వెళ్లినా పార్టీకి దూరమవుతారని ఆమె అన్నారు. 

కేజే కుమార్ నగరిలో ప్రముఖ నాయకుడు. ఆయన 2019 ఎన్నికల్లో రోజాకు సహకరించలేదని అంటారు. ఇటీవల రోజాను వైసీపీ కార్యకర్తలే నగరిలో అడ్డుకోవడం, రోజా కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే రోజా తాజా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

కేజే కుమార్ వర్గం కూడా రోజా ఆడియోకు పోటీగా ఆడియోను విడుదల చేసింది. కార్యకర్తలు హాజరు కావాలంటూ కేజే వరం ఆడియోలో కోరింది.

click me!