
జోమాటో డెలివరీ ముసుగులో కొందరు ప్రబద్ధులు డ్రగ్స్ డెలివరీ చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తోంది ఈ వ్యవహారం. డెలవరీ బాయ్‌నని చెప్పుకుంటున్న చుంచు నితీష్ చంద్రను పట్టుకున్నారు సికింద్రాబాద్ తుకారం గేట్ పోలీసులు. డ్రగ్స్ పెడ్లర్ రాహుల్ ఆదేశాల మేరకు అవసరమైన వ్యక్తులకు గంజాయి సరఫరా చేస్తున్నాడు నితీశ్ చంద్ర.
Also Read:పెళ్లి ముసుగులో డ్రగ్స్ సరఫరా: ఇద్దరిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
ఇతను ఫుడ్ ఐటెమ్స్ కోడ్ భాషను ఉపయోగిస్తూ గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాలోని సభ్యుడని అనుమానిస్తున్నారు. జోమాటాలో ఉద్యోగం చేస్తూ అదనపు డబ్బు కోసం గంజాయి సరఫరా చేస్తున్నాడు నితీశ్. అతని వద్ద నుంచి సుమారు 600 గ్రాముల గంజాయితో పాటు రూ.5000 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నితీశ్ చంద్రను ప్రశ్నిస్తే మొత్తం గుట్టు బయటకు వచ్చే అవకాశం వుంది. ఇప్పటి వరకు అతను 30 మంది వరకు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో నితీశ్ అరెస్ట్ కావడంతో భువనగిరి పోలీసులకు లొంగిపోయాడు రాహుల్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ సిబ్బందితో కలిసి మంగళ్‌హాట్ పోలీసులు శనివారం ముగ్గురు గంజాయి వ్యాపారులను, ఒక గంజాయి రవాణాదారుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 72 కేజీల గంజాయి, 1.8 కేజీల గంజాయి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రధాన ప్రధాన నిందితుడు హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌లోని ధూల్‌పేట్ ఆకాష్ సింగ్‌గా గుర్తించారు. 2018 నుంచి అతను ఖమ్మంకు చెందిన షేక్ సుభానీ నుంచి గంజాయిని సేకరించి హైదరాబాద్‌లో పలువురు వినియోగదారులకు విక్రయిస్తున్నాడు.
అతడిపై హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో 5 కేసులు ఉన్నాయి. అంతకుముందు అతను 2021లో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడ్డాడు. అయితే 2022 జూన్‌లో అతడు విడుదలయ్యాడు. తిరిగి గంజాయి సరఫరా చేయడం ప్రారంభించాడు. ఇక, షేక్ సుభానీ ఒడిశా రాష్ట్రంలోని పాపులూరులో గంజాయిని పండించే వల్సగడ్డ మహేష్ నుంచి పెద్దమొత్తంలో గంజాయిని సేకరించి.. హైదరాబాద్‌లో ప్రధాన వ్యాపారి అయిన ఆకాష్ సింగ్‌కు రవాణా చేస్తున్నాడు.