అలా అయితే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్తా: షర్మిల పాదయాత్ర షురూ

By narsimha lodeFirst Published Oct 20, 2021, 2:52 PM IST
Highlights


వైఎస్ షర్మిల చేవేళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పాదయాత్రను ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు.

హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని  కేసీఆర్ సర్కార్ ను గద్దె దింపడం కోసమే  ప్రజా ప్రజాస్థానం యాత్ర చేపట్టినట్టుగా వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు.బుధవారం నాడు చేవేళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి వద్ద నిర్వహించిన సభలో  వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు ys Sharmilaప్రసంగించారు. ఇవాళ్టి నుండి 4 వేల కి.మీ పాదయాత్రకు షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

also read:కాళేశ్వరం వైఎస్ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చింది: వైఎస్ విజయమ్మ

కేసీఆర్ అవినీతి పాలనకు చరమ గీతం పాడేందుకు పాదయాత్ర చేస్తున్నట్టుగా ఆమె స్పష్టం చేశారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే బీజేపీని గంగలో కలిపేందుకు పాదయాత్ర చేస్తున్నట్టుగా ఆమె స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన కాంగ్రెస్ ను చీల్చి చెండాడుతానని ఆమె చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దొరగానూ, కేటీఆర్ ను చిన్న దొరగానూ షర్మిల తన ప్రసంగంలో సంబోధించారు.

దమ్ముంటే Telangana రాష్ట్రానికి దళితుడిని సీఎం చేయాలని ఆమె Kcrకు సవాల్ విసిరారు. తాము దీక్షలు చేస్తేనే కేసీఆర్‌కు ఉద్యోగాల భర్తీ గుర్తుకు వచ్చిందన్నారు.తెలంగాణలో వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకొన్నారని చెప్పారు. కళ్ల ముందు 1.90 లక్షల ఉద్యోగాలున్నా నోటిఫికేషన్లు ఎందుకు జారీ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. హమాలీలుగా నిరుద్యోగులు మారారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లలో 30 వేల ఉద్యోగాలను పీకేశారన్నారు.

రాష్ట్రంలో సమస్యలే లేవని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని... నిజంగా సమస్యలు లేకపోతే తాను ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతానని ఆమె సవాల్ విసిరారు. తనతో పాటు పాదయాత్ర చేస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేటీఆర్ కు చూపిస్తానని ఆమె చెప్పారు. రాష్ట్రంలో సమస్యలుంటే రాజీనామాలు చేసి దళితుడిని సీఎం చేయాలన్నారు. తెలంగాణలో 800 శాతం దళితులపై దాడులు పెరిగాయన్నారు.  

వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేపట్టిన పథకాలను ఆమె గుర్తు చేశారు. ప్రతి వర్గాన్ని మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌దేనన్నారు.ఒక్క మాట మీద నిలబడని కేసీఆర్ కు మాట మీద నిలబడే వైఎస్ఆర్ గురించి విమర్శించే అర్హత లేదని ఆమె మండిపడ్డారు.వైఎస్ఆర్ చేపట్టిన పథకాలతో వందలాది మంది తెలంగాణ గుండెల్లో  నిలిచిపోయారన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఉద్దేశ్యాన్ని ఆమె వివరించారు.

రేవంత్ రెడ్డిపై షర్మిల ఫైర్

కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకొన్న నేత  రేవంత్ రెడ్డి తమ పార్టీ ఎన్జీఓ సంస్థ అంటూ చేసిన విమర్శలపై ఆమె స్పందించారు. ఎన్జీఓ అంటే సామాజిక సేవ చేసే సంస్థ అని ఆమె చెప్పారు. సమాజం కోసం తాము లాభం చూసుకోకుండా పనిచేస్తున్నామన్నారు.రేవంత్ రెడ్డి మాదిరిగా అవినీతి, బెదిరింపులు చేతకాదని ఆమె చెప్పారు. రేవంత్ రెడ్డి మాదిరిగా ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడం, అమ్ముకోవడం తనకు తెలియదని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిరహార దీక్షలు చేయడం ప్రజల పక్షాన పోరాటం చేయడమే తనకు తెలుసునన్నారు. ఎవరికి విశ్వసనీయత ఉందో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. మాట మీద నిలబడే రాజన్న బిడ్డకు విశ్వసనీయత ఉందా ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగకు విశ్వసనీయత ఉందా అనేది ప్రజలే తేలుస్తారన్నారు.

ఎవరిది రాజకీయం, ఎవరిది ఎన్జీఓ, ఎవరిది వ్యాపారమనే విషయాన్ని కూడ ప్రజలే నిర్ణయిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ చేతిలోనే ఉందని ఆమె చెప్పారు.కేసీఆర్ ఎఫ్పుడు అనుకొంటే అప్పుడే రేవంత్ రెడ్డి పిలకే కాదు తల తీసేస్తాడన్నారు.  రాహుల్ గాంధీ మాట విన్నా వినకున్నా కేసీఆర్  మాటను రేవంత్ రెడ్డి వినాల్సిన అనివార్య పరిస్థితి ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ఇలాంటి రేవంత్ ను నమ్ముకొన్న కాంగ్రెస్ పార్టీ కుక్కుతోక పట్టుకొని గోదావరి ఈదినట్టేనన్నారు.

తన నియోజకవర్గంలో నియోజకవర్గంలో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకొంటే రేవంత్ రెడ్డి పరామర్శించలేదన్నారు.  ఇప్పుడేమో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సభలు పెడితే ఎవరు నమ్ముతారని ఆమె ప్రశ్నించారు.

బీజేపీ, టీఆర్ఎస్ లు కలిసిపోయాయని ఆమె విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు పరస్పరం విమర్శలు చేసుకొంటూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. అంతర్గతంగా ఈ రెండు పార్టీలు దోస్తీ కొనసాగుతుందన్నారు.  బీజేపీ నేతల వద్ద ఆధారాలుంటే ఎందుకు బీజేపీ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వడం లేదని కమలం నేతలపై విరుచుకుపడ్డారు.ఈ సభ ముగిసిన తర్వాత ఆమె పాదయాత్రను ప్రారంభించారు. 2003లో ఇదే  చేవేళ్ల నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పాదయాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.


 

click me!