
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి అవసరమా? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్ర వైఎస్ షర్మిల ప్రజలను ప్రశ్నించారు. ఉద్యమకారుడు కదా అని రెండుసార్లు అధికారం ఇస్తే రాష్ట్రప్రజల నెత్తిన టోపీ పెట్టాడని... చివరకు మంచం కోళ్లను సైతం ఎత్తుకు పోయే రకం ఈ కేసీఆర్ అంటూ ఎద్దేవా చేసారు. ఎన్నికలు వస్తున్నాయి కదా మళ్ళీ వస్తాడు...ఈ సారి ఏ బీసీబందో... ఎస్టీ బందో అంటాడని షర్మిల అన్నారు.
వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామంలో పాదయాత్ర ప్రారంభం సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
వరి వేయడం ఈసారి శాపం అయ్యింది. సీఎం కేసీఆర్ ఊసరవెల్లిలా మాటలు మార్చి తెలంగాణ రైతులను బ్యాంక్ ల దగ్గర డీ ఫాల్టర్లుగా మిగిల్చారు. బ్యాంక్ వాళ్ళు రైతులను దొంగలుగా చూస్తున్నారు. కొన్నిచోట్ల రైతుల ఇళ్లను కూడా జప్తు చేస్తున్నారు. ఇలా అనేక సమస్యలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ కేసీఆర్ దే'' అని షర్మిల ఆరోపించారు.
''గతంలో వైఎస్సార్ హయాంలో వ్యవసాయం లాభసాటిగా ఉండేది. కానీ ఇప్పుడు రైతులకు ముష్టి రూ.5 వేలు ఇస్తూ దీనివల్లే వారు కోటేశ్వర్లు అయిపోతున్నట్లు కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. ఈ ఐదువేలకే రైతులు కార్లలో తిరుగుతారా? రూ.25 వేలు ఇచ్చే పథకాలు బంద్ పెట్టీ ఇలా నేరుగా చేతికి ఐదువేలిస్తూ కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు'' అన్నారు.
''గతంలో మాదిరిగా విత్తనాల సబ్సిడీ లేదు.. ఎరువుల మీద సబ్సిడీ లేదు. కేవలం రైతుబంధు పేరిట డబ్బులిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. నిజంగానే ప్రభుత్వం రైతుబంధు అన్నదాతలకు భరోసాగా ఉంటే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు?'' అని షర్మిల నిలదీసారు.
''60 ఏళ్లు దాటితే నే భీమా అని రైతు నుదుటి మీద మరణ శాసనం రాస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతును ఏ విధంగా ఆదుకోవడం లేదు... అన్ని రకాలుగా మోసం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో ఏ ఒక్క కుటుంభానికి న్యాయం జరిగిందో చెప్పాలి. చివరికి పెన్షన్లు కూడా సమయానికి ఇవ్వడం లేదు'' అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేసారు.
''తెలంగాణ రాష్ట్రం మీద కేసీఆర్ రూ.4 లక్షల కోట్లు అప్పులు చేశారు. కానీ రాష్ట్రం బాగుపడింది లేదు కేవలం కేసీఆర్ కుటుంభం మాత్రమే బాగుపడింది. కేసీఆర్ కుటుంబంలో 5 ఉద్యోగాలు కావాలి... కానీ మా బిడ్డలు మాత్రం హమాలీ పనులకు పోవాలా? పరిపాలన చేతకాకపోతే అధికారంలో ఉండి ఏం లాభం'' అని షర్మిల మండిపడ్డారు.
''సంక్షేమ పాలన కోసమే పార్టీ పెట్టాను. వైఎస్సార్ టిపి అధికారంలోకి వస్తే నమ్మకంగా సేవ చేస్తా అని మాట ఇస్తున్నా. వ్యవసాయాన్ని పండుగ చేస్తా... రైతును రారాజు చేస్తా. భారీగా ఉద్యోగాలు ఇస్తాం. ఫీజు రియంబర్స్ మెంట్... ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తాం. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ పెన్షన్లు ఇస్తాం'' అని షర్మిల హామీ ఇచ్చారు.