
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు జయంతి వేడుకలను శనివారం తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల జరుపుకున్నారు. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్థలు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అయితే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఆయనకు నివాళులర్పించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నివాళులర్పించడమే కాకుండా.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి చెందిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఇది రాజకీయంగా సరికొత్త చర్చకు దారితీసింది.
శనివారం(మే 28) ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్‌కు చేరకున్న మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మరికొందరు టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాత పలువురు నేతలు మాట్లాడుతూ.. ఎన్‌టీ రామారావు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు మధ్య పోలికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ లాగానే కేసీఆర్ కూడా పేదల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. చరిత్ర సృష్టించిన తెలుగు బిడ్డకు నివాళి అర్పించాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.
‘‘ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అలాగే కేసీఆర్ కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని టీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. ఇక, ఎన్టీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని ఎంపీ నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
మరోవైపు హైదరాబాద్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హన్మకొండలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. సత్తుపల్లిలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్.. ఎన్టీఆర్ ఘాట్‌కు వస్తారనే ప్రచారం సాగింది. కానీ అలా జరగలేదు.
ఎన్టీఆర్ శత జయంతి కావడంతో ఈ వేడుకల్లో పాల్గొన్నామని టీఆర్‌ఎస్ నేతలు చెబుతుండగా.. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఓటర్లను టీఆర్‌ఎస్ ఓటుబ్యాంకులో భద్రంగా ఉంచుకునే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలోని ముఖ్యంగా హెచ్‌ఎండీఏ పరిధిలోని ఆంధ్రా మూలాల ఓటర్ల మద్దతు తప్పనిసరి అని వారు చెబుతున్నారు. అంతేకాకుండా ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ సామాజికవర్గం మద్దతు అవసరమని టీఆర్‌ఎస్ భావిస్తోందని.. అందుకే కొత్తగా ఎన్టీఆర్ జపం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే టీఆర్‌ఎస్ నాయకులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించినప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత.. మాత్రం ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్నట్టుగా ఎలాంటి ప్రకటన గానీ, సోషల్ మీడియాలో గానీ పోస్టులు చేయకపోవడం గమనార్హం.
గతంలో టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నవారే..
ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన నేతల్లో ఒకరిద్దరు మినహా అందరూ గతంలో టీడీపీలో క్రీయాశీలకంగా పనిచేసేవారు. వారంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు కూడా టీడీపీలో ఉన్నవారే. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు.. టీడీపీలో కీలక నేతలుగా ఉన్నావారే. వీరంతా కూడా 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాతే గులాబీ కండువా కప్పుకున్నారు. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు గాంధీ, గోపీనాథ్, భాస్కర్‌రావు ఒకే సామాజికవర్గానికి (ఎన్టీఆర్ సామాజికవర్గానికి) చెందిన వారే కావడం విశేషం.
రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చేందుకేనా..?
తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరి టీపీసీసీ పగ్గాలు చేపట్టారు. ఆయన వెంటే పలువురు టీడీపీ నేతలు కూడా హస్తం పార్టీలో చేరారు. అయితే రేవంత్ కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ సానుభూతిపరుల నుంచి మద్దతు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే రేవంత్‌కు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానుల్లో ఉన్న మద్దతుకు చెక్ పెట్టేందుకే.. టీఆర్‌ఎస్ తొలిసారిగా ఎన్టీఆర్ కార్డు వేసినట్లు కనిపిస్తోందనే టాక్ వినిపిస్తుంది.
ఎన్టీఆర్‌కు ఉన్న లక్షణాల్లో కేసీఆర్‌కు ఒక్కటీ లేదు.. నాగం
టీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్‌కు నివాళులర్పించడంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి స్పందించారు. ఎనిమిదేళ్లుగా ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణను పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే మంత్రులు, ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ ఘాట్‌కు పంపించారని విమర్శించారు. ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ సరిగా చేయకుంటే ఖాకీ బట్టలు వేసుకుని ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. కేసీఆర్ ప్రతి నిర్ణయం వెనక రాజకీయ కోణం ఉంటుందన్నారు. ఎన్టీఆర్‌కు ఉన్న లక్షణాల్లో కేసీఆర్‌కు ఒక్కటీ లేదని ఆయన విమర్శించారు. నేటి తరం నాయకులు ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం తన వంతు కృషి చేస్తానని నాగం జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.