సెంటిమెంట్ ను వాడుకుని అధికారంలోకి వచ్చి పదవులు అనుభవిస్తున్న తండ్రీకొడులు కేసీఆర్, కేటీఆర్ కంటే పెద్ద తెలంగాణ ద్రోహులు ఇంకెవరూ వుండరని వైఎస్ షర్మల ధ్వజమెత్తారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగావున్నా బిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల వదిలిపెట్టడంలేదు. కాంగ్రెస్ కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ మద్దతిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీకి అనుకూలంగా, బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా షర్మిల కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని షర్మిల ఆరోపించారు.
''అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా సెంటిమెంట్ ని వాడుకుంటున్నావా కేటీఆర్... మీ తండ్రీకొడుకులను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరు... నమ్మి రెండు దఫాలు అధికారమిస్తే రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా తిన్న వెన్నుపోటుదారులు మీరు.. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి, కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్న బందిపోట్లు మీరు. రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి దివాలా తీయించిన దొంగలు మీరు.కోటి ఎకరాల మాగానికి సాగునీరని పనికి రాని ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్లు కాజేసిన దోపిడీదారులు మీరు'' అంటూ షర్మిల ధ్వజమెత్తారు.
''ఇంటికో ఉద్యోగం అని చెప్పి 10 ఏళ్లలో లక్ష ఉద్యోగాలు ఇవ్వలేని మీరు నిరుద్యోగుల పాలిట వ్యతిరేక శక్తులు. 3 ఎకరాల భూమి,ఇంటికి 10 లక్షలు అని చెప్పి దళితులను దగా చేసిన దళిత ద్రోహులు మీరు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం ప్రజలంతా ఏకమై సాగించిన ఉద్యమం సాక్షిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. నిధులు మీ ఖజానాకే.. నీళ్లు మీ ఫామ్ హౌజ్ కే.. నియామకాలు మీ ఇంట్లోకే.ఇంకా సెంటిమెంట్ రాజకీయాలు చేసి గద్దెనెక్కాలనుకోవడం మీ అవివేకానికి, అత్యాశకు నిదర్శనం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి,నియంత పాలన చేస్తున్న తాలిబన్లను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారు'' అంటూ షర్మిల ఎక్స్(ట్విట్టర్) వేదికన షర్మిల ట్వీట్ చేసారు.
Read More కేసీఆర్ కు ఆ పదవి ఇప్పించిందే నేను...: తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం పోటీకి దూరంగా వుంటున్నట్లు షర్మిల ప్రకటించారు. తెలంగాణ ప్రజల్లో బిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత వుందని... దీంతో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు వున్నాయని షర్మిల తెలిపారు. కాబట్టి ఓట్లు చీలిపోకుండా వుండేందుకు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని... అందువల్లే వైఎస్సార్ టిపి ఎన్నికల్లో పోటీ చేయడంలేదని షర్మిల తెలిపారు.
కేసీఆర్ అవినీతి పాలనను అడ్డుకునేందుకే కాంగ్రెస్ కు మద్దతిస్తున్ననట్లు షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అపారమైన గౌరవం వుందని... సోనియా, రాహుల్ గాంధీ తనను కుటుంబంలో ఒకరిలా ఆప్యాయంగా మాట్లాడారని అన్నారు. వారి కోరిక మేరకే తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నానని వైఎస్ షర్మిల తెలిపారు.