చేవెళ్ల సెంటిమెంట్: అక్టోబర్ 18 నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర

By telugu teamFirst Published Aug 9, 2021, 8:36 AM IST
Highlights

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల అక్టోబర్ 18వ తేదీ నుంచి తెలంగాణలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. తన పాదయాత్రను తండ్రిలాగే చేవెళ్ల నుంచి ప్రారంభిస్తారు.

హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల అక్టోబర్ 18వ తేదీ నుంచి తెలంగాణలో తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. చేవెళ్ల సెంటిమెంట్ తోనే ఆమె ఈ పాదయాత్ర చేపట్టనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేవెళ్ల నుంచి తన పాదయాత్రను ప్రారంభించి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. షర్మిల కూడా తన పాదయాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభించనున్నారు. 

తన సోదరుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో వైఎస్ షర్మిల 2012లో పాదయాత్ర చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 జిల్లాల గుండా ఆమె పాదయాత్ర సాగింది. మొత్తం 3,112 కిలోమీటర్ల నడిచి రికార్డు సృష్టించారు. అన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తొలి మహిళగా ఆ రికార్డును సొంతం చేసుకున్నారు. 

వైఎస్ షర్మిల కడప జిల్లాలోని పులివెందుల నుంచి మరో ప్రజా ప్రస్థానం యాత్రను చేపట్టి 2013 ఆగస్టు 4వ తేదీన శ్రీకాకుళంలో ముగించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లో తన పాదయాత్రను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించారు. 1,467 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర సాగింది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి వచ్చి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 

నోటీసు ఇవ్వకుండా కాంట్రాక్టు కార్మికులను కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగిస్తోందని వైఎస్ షర్మిల ఆదివారంనాడు విమర్శించారు. 52 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని ఆమె ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. 

click me!