మేం ప్రభుత్వాల్ని నడపలేదా.. పోలీసులు మాకేం కొత్తా : షర్మిల అరెస్ట్‌పై వైఎస్ విజయమ్మ

Siva Kodati |  
Published : Nov 29, 2022, 04:40 PM IST
మేం ప్రభుత్వాల్ని నడపలేదా.. పోలీసులు మాకేం కొత్తా : షర్మిల అరెస్ట్‌పై వైఎస్ విజయమ్మ

సారాంశం

వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్‌పై ఆమె తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. తాము గతంలో ప్రభుత్వాల్ని నడపలేదా.. తమకు పోలీసులు కొత్త కాదని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో వున్న తన కుమార్తె, వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను కలిసేందుకు విజయమ్మ బయల్దేరారు. అయితే అక్కడి ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో లోటస్ పాండ్‌లోని నివాసంలోనే విజయమ్మను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఆమె ఇంట్లోనే ఆమరణ దీక్షకు దిగినట్లుగా తెలుస్తోంది. తనను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ విజయమ్మ దీక్షకు దిగారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన కుమార్తెను చూడటానికి వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారని విజయమ్మ ప్రశ్నించారు. తనను వెళ్లనీయకుంటే దీక్షకు దిగుతానని ఆమె హెచ్చరించారు. మరోవైపు షర్మిల అరెస్ట్ గురించి తెలుసుకున్న వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు, అభిమానులు ఎస్ఆర్ నగర్ పీఎస్‌కు భారీగా చేరుకుంటున్నారు. 

పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా.. పోలీసులు ఇలా చేయడం తప్పు కాదా అని విజయమ్మ ప్రశ్నించారు. షర్మిల దేనికీ భయపడే రకం కాదని ఆమె తేల్చిచెప్పారు. తన కూతురికి తోడుగా వుండేందుకు వెళ్తానన్నానని, పోలీసులు ఒప్పుకోవడం లేదని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చెప్పిన సమస్యలపైనే షర్మిల మాట్లాడుతోందన్నారు. కేసీఆర్‌పై షర్మిల ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని విజయమ్మ తేల్చిచెప్పారు. షర్మిల చేసిన నేరం ఏంటన్న ఆమె.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా అని ప్రశ్నించారు. మేం ప్రభుత్వాల్ని నడపలేదా.. తమకు పోలీసులు కొత్త కాదని విజయమ్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. 

Also Read:వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు ఊరట: పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కాగా... నిన్న నర్సంపేట అసెంబ్లీ  నియోజకవర్గంలోని  లింగగిరిలో  వైఎస్ షర్మిలకు చెందిన  బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టారు. అంతే కాదు  షర్మిల  పార్టీకి  చెందిన వాహనాలపై దాడి చేశారు . ఈ ఘటనలో  నాలుగు వాహానాలు ధ్వంసమయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణుల దాడిని  వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం  చేశాయి. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో  వైఎస్  షర్మిలను పోలీసులు  అరెస్ట్ చేసి  హైద్రాబాద్ కు తీసుకు వచ్చి రాత్రి లోటస్ పాండ్‌లో వదిలి వెళ్లిపోయారు.  

అయితే నర్సంపేటలో టీఆర్ఎస్  శ్రేణుల దాడికి నిరసనగా  ఇవాళ ప్రగతి భవన్ ను ముట్టడించాలని  వైఎస్ఆర్‌టీపీ తలపెట్టింది.    పోలీసుల కళ్లుగప్పి  షర్మిల  లోటస్  పాండ్ నుండి బయటకు వెళ్లారు. సోమాజీగూడ నుండి ధ్వంసమైన  కారుతో  ప్రగతి భవన్ వైపునకు వెళ్లే  ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు పంజాగుట్టలో  షర్మిలను అడ్డుకున్నారు. అయితే కారులో నుండి దిగకుండా  ఆమె  నిరసనకు దిగారు. ప్రగతి భవన్ కు తాను వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. కారు అద్దాలు కూడా దించలేదు. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో కారుతో సహా షర్మిలను ఎస్ఆర్ నగర్  పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఎస్ఆర్ నగర్  పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన తర్వాత  కూడా  ఆమె  కారు నుండి దిగలేదు. దీంతో కారు డోర్ లాక్స్ ఓపెన్  చేసి  షర్మిలను  ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోనికి తీసుకెళ్లారు పోలీసులు. మరోవైపు షర్మిలకు మద్దతుగా  వచ్చిన  వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు, షర్మిల అభిమానులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?