నీకయితే యశోదా... పేదలయితే ప్రభుత్వాస్పత్రి... ఇదెక్కడి న్యాయం కేసీఆర్: నిలదీసిన షర్మిల

By Arun Kumar PFirst Published Jun 25, 2021, 3:04 PM IST
Highlights

కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. 

కరీంనగర్: తెలంగాణ రాజకీయాల్లో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న వైఎస్ షర్మిల నిరుద్యోగ, రైతుల సమస్యలపై ఇప్పటివరకు జిల్లాల పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. . ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్సార్ ను కొనియాడుతూ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు షర్మిల. 

''పేద వాళ్ల కోసం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకం తెచ్చారు. దీంతో వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలు సైతం కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం పొందగలిగారు. అంతకుముందు ఒక్క నాయకుడు కూడా ఇలా ఆలోచించలేదు. నా తండ్రిది పెద్ద మనసు ఈ ఆలోచన చేశారు'' అని షర్మిల వైఎస్సార్ ను కొనియాడారు. 

''ఎన్నో కుటుంబాలని ఆరోగ్య శ్రీ పథకం నిలబెట్టింది. కానీ కరోనా విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో ఆరోగ్య శ్రీ అందడం లేదు. కరోనా రోగాన్ని ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చలేదు?'' అంటూ  షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

read more  వైఎస్ రాజశేఖర్ రెడ్డి నరరూప రాక్షసుడు.. శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు..

''పేద వాళ్ళను తెలంగాణ సర్కారు ఆదుకోవడం లేదు. అయినా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుండి బయటకు వస్తే రాష్ట్రంలో పరిస్థితులు తెలుస్తాయి. అధికారుల మాటలనే నమ్ముతూ ఫామ్ హౌస్ నుండి పాలించడం కాదు... బయటకు వస్తే కనీసం నిజాలేంటో తెలుస్తాయి'' అన్నారు. 

''ఆరోగ్య శ్రీ లో కరోనా చేర్చి వైద్యం అందించాలి. కేంద్రం అందించే ఆయుష్మాన్ భారత్ అమలు వల్ల లాభమేమీ లేదు. సీఎం కేసీఆర్ మాత్రం వైద్యం కోసం యశోద ఆస్పత్రికి వెళ్తారు... పేదవారు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలా?  మీకో న్యాయం పేద వారికి ఓ న్యాయమా...? చెల్లెళ్ల కన్నీళ్లకు విలువ లేదా? కోవిడ్ తో చనిపోయిన వారికి ఐదు లక్షలు ఇవ్వాలి'' అని షర్మిల డిమాండ్ చేశారు. 
 

click me!