నిజమా?: క్షమాపణలు కోరుతూ ఈటల కేసీఆర్ రాశారంటూ ఓ లేఖ వైరల్

By telugu team  |  First Published Jun 25, 2021, 2:49 PM IST

క్షమాపణలు కోరుతూ ప్రస్తుత బిజెపి నేత ఈటల రాజేందర్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓ లేఖ రాశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


హైదరాబాద్: మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కాక ముందు ప్రస్తుత బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావును క్షమాపణలు కోరుతూ రాశారంటూ చెబుతున్న ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను చేసింది తప్పేనని, సమావేశాలు జరిగింది నిజమేనని, తనతో పాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన నాయకులు కూడా హాజరు కావడం వాస్తవమేనని అంగీకరిస్తూ ఈటల రాజేందర్ కేసీఆర్ కు ఆ లేఖను రాసినట్లు చెబుతున్నారు. 

కేసీఆర్ కు వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ రాశారంటూ చెబుతున్న ఆ లేఖ బయటకు ఎలా వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను చేసిన తప్పులను సరిదిద్దుకుంటానని ఆయన కేసీఆర్ కు ఆ లేఖ ద్వారా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తాను ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించానని ఈటల రాజేందర్ చెప్పారు. దానికీ, ఈ లేఖకు లింక్ పెడుతూ కూడా ప్రచారాలు సాగుతున్నాయి.

Latest Videos

ఆ లేఖ మీద తేదీ లేదు. ఒకవేళ ఈటల రాజేందర్ రాసి ఉంటే ఎప్పుడు రాశారనేది తెలియదు. ఇది నిజంగానే ఈటల రాజేందర్ రాసిన లేఖనేనా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ అది నిజమైతే దాన్ని లీక్ చేసింది ఎవరు, ఎందుకు లీక్ చేశారనేది కూడా తేలాల్సి ఉంది. ఓ నకిలీ లేఖను ఎవరైనా సృష్టించి ప్రచారం చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. 

ఇదిలావుంటే, ఆ లేఖ ఫేక్ అని ఈటల రాజేందర్ మీడియా ప్రతినిధి ఏషియానెట్ న్యూస్ తో చెప్పారు. దానిపై సైబర్ క్రైమ్ పోలీసులకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు కూడా తెలిపారు.

click me!