నీ పిల్లలకు ఉద్యోగాలిచ్చావ్... మరి ప్రజల పిల్లలకు ఎప్పుడు..: కేసీఆర్ పై షర్మిల సీరియస్

By Arun Kumar PFirst Published Jun 2, 2021, 12:04 PM IST
Highlights

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని శేరిల్లా గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి వెంకటేశ్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు.

మెదక్: నిరుద్యోగ యువత ఆత్మహత్యలను నిరసిస్తూ వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్ లో పర్యటిస్తున్నారు. వెల్దుర్తి మండలంలోని శేరిల్లా గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులకు అండగా వుంటానని షర్మిల భరోసా ఇచ్చారు. 

ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని సాధించాలని భావించిన వెంకటేష్ డీఎస్సి కోచింగ్ తీసుకున్నాడు. కోచింగ్ తర్వాత కూడా ప్రిపరేషన్ కొనసాగించాడు. అయితే ఇటీవల ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ప్రిపరేషన్ మరింత ముమ్మరం చేశాడు. అయితే ప్రకటన వెలువడి నెలలు గడుస్తున్నా ఎంతకూ నోటిఫికేషన్ రాకపోవడంతో మనస్థాపానికి గురయిన వెంకటేష్ గత నెల మే16న ఆత్మహత్య చేసుకున్నాడు. 

read more  మీకు అండగా వుంటా.. ఆత్మహత్యలకు పాల్పడొద్దు: నిరుద్యోగులకు షర్మిల భరోసా

వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం షర్మిల మాట్లాడుతూ... కేవలం మీ పిల్లలకే ఉద్యోగాలిచ్చుకుంటారా? అని కేసీఆర్ ను నిలదీశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వద్దా? ఎప్పుడిస్తారు? అని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ప్రభుత్వం మరణ శాసనాలు రాస్తోందని షర్మిల మండిపడ్డారు. 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని భావించి యువత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని... రాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడిచినా ఉద్యమ లక్ష్యాలు నెరవేరలేవన్నారు. నిరుద్యోగ సమస్య ఇంకా తెలంగాణలో వుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇప్పటికీ తెలంగాణలో ఆత్మహత్యలు కొనసాగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని షర్మిల అన్నారు. 

click me!