చేవెళ్ల సెంటిమెంట్: ఏప్రిల్ 10న వైఎస్ షర్మిల తెలంగాణ పార్టీ

By telugu teamFirst Published Feb 11, 2021, 7:39 AM IST
Highlights

వైఎస్ 18 ఏళ్ల క్రితం చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించి ఉమ్మడి ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆ చేవెళ్ల సెంటిమెంటునే వైఎస్ షర్మిల నమ్ముకున్నట్లు కనిపిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించి ముందుకు సాగడానికి వైఎస్ కూతురు షర్మిల అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. చేవెళ్ల సెంటిమెంట్ మీద ఆమె నమ్మకం పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమె ఏప్రిల్ 10వ తేదీన తన రాజకీయ పార్టీపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

2003 ఏప్రిల్ 10వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. దాంతో చేవెళ్లలోనే తన రాజకీయ పార్టీని ప్రకటించి షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర ప్రారంభించడానికి సమయం తీసుకుంటే భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. 

తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలవారీగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలను ఏప్రిల్ 10వ తేదీలోగా ముగించాలని ఆమె అనుకుంటున్నారు.  వచ్చే ఏప్రిల్ 10వ తేదీ నాటికి వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించి 18 ఏళ్లు గడుస్తోంది. దీంతో అదే రోజు పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యక్రమాన్ని చేవెళ్లలో పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలపై బుధవారం వైఎస్ షర్మిల ముఖ్య నాయకులతో చర్చించారు. హైదరాబాదుకు సమీపంలో ఉన్న ఉమ్మడి జిల్లాల సమ్మేళనాలను నగరంలో నిర్వహించాలని, ఇతర ఉమ్మడి జిల్లాల సమ్వేళనాలకు ఆయా జిల్లాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

click me!