
హైదరాబాద్ : పేదలకు వైద్యసేవలు అందించే ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి గురించి స్పందించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రవ్యాఖ్యలు చేసారు. ఆమె గవర్నర్ లా కాకుండా బిజెపి అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారని... కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా వ్యాఖ్యలు వున్నాయంటూ మండిపడ్డారు. ఇలా గవర్నర్ పై హరీష్ చేసిన కామెంట్స్ కు వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటరిచ్చారు.
పేదలకు మెరుగైన వైద్యసేవలు అందేలా చూడండి... హామీ ఇచ్చినట్లు మంచి ఆసుపత్రి కట్టించండి అని గవర్నర్ ప్రభుత్వాన్ని అడగడమూ తప్పేనా? అని మంత్రిని ప్రశ్నించారు షర్మిల. రాష్ట్ర ప్రధమ పౌరురాలే కాదు స్వయంగా ఓ డాక్టర్ అయిన తమిళిసై సౌందరరాజన్ ప్రజారోగ్యం గురించి ఆవేదనతో అడిగినా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టేనా హరీష్ రావు గారు? అంటూ నిలదీసారు. బాధ్యతాయుతమైన గవర్నర్ పదవిలో వున్న ఓ మహిళ పేదల ఆరోగ్యం కోసం ఆందోళనతో మాట్లాడితే కనీస గౌరవం లేకుండా వీధి రౌడీ కంటే హీనంగా మాట్లాడుతారా..? అంటూ హరీష్ పై షర్మిల మండిపడ్డారు.
ప్రజారోగ్యం పట్ల సామాన్యులు, వైద్యులే కాదు చివరకు గవర్నర్ ఆందోళన వ్యక్తంచేసినా వారంతా ద్రోహులేనా? ప్రభుత్వ పనితీరుపై నిందలు వేసినట్లేనా? అంటూ షర్మిల ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను మూయించే మీకు చివరకు గవర్నర్ అంటే కూడా లెక్కలేకుండా పోయిందన్నారు. మహిళా గవర్నర్ తమిళిసై అంటే అసలే గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని షర్మిల అన్నారు.
నిజాంల కాలంనాటి భవనంలో కొనసాగుతున్న ఉస్మానియా హాస్పిటల్ ప్రాంగణంలో అద్భుతమైన ట్విన్ టవర్స్ కడతామని సీఎం కేసీఆర్ 2015 ఇచ్చిన హామీ ఏమయ్యిందని షర్మిల ప్రశ్నించారు. పిట్టల దొర కేసీఅర్ మాటలు గుర్తు తెచ్చుకోండని అన్నారు. టోపీ పెట్టుకొని రెండేళ్లలో కొత్త భవనాలు అంటూ మాటిచ్చిన సంగతి యాది చేసుకోండన్నారు. ఈ అంశం కోర్టులో వుందని అంటున్నారే... మరి హాస్పిటల్ లో మౌళిక సదుపాయాల కల్పించాల్సిన సోయి వైద్యారోగ్య శాఖ మంత్రిగా మీకుండాలి కదా అంటూ హరీష్ పై షర్మిల సీరియస్ అయ్యారు.
Read More బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడొద్దు: ఉస్మానియాపై తమిళిసైకి హరీష్ కౌంటర్
ప్రాణం మీదకొచ్చిందని పెద్దాసుపత్రికోస్తే బెడ్లు లేవని రోజుకు వందల మందిని తిప్పి పంపుతున్నారు... హాస్పిటల్లో చేరినవారి పరిస్థితి బావుందా అంటే అదీ లేదన్నారు షర్మిల. వైద్యం అందడం లేదు మహా ప్రభో అని రోగుల ఆర్తనాదాలు అంతా ఇంతా కాదన్నారు. ఒక్కో బెడ్డు మీద ముగ్గురు నలుగురికి వైద్యం చేస్తున్నాం అంటూ స్వయంగా వైద్యులే చెప్తున్నారని అన్నారు. మీ విలాసాల కోసం 16 వందల కోట్లతో రెండేళ్లకే సచివాలయం పూర్తయితే... వెయ్యి కోట్లతో కట్టే ఉస్మానియా టవర్లకు ఇప్పటికీ పునాది రాయి కూడా ఎందుకు పడలేదంటూ షర్మిల నిలదీసారు.
హైదరాబాద్ నలుమూలల కడతామని చెప్పిన పెద్దాసుపత్రులకు సంగతేంటని షర్మిల అడిగారు. ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డైడ్ అన్నట్లే మీ అరోగ్య శాఖ పని తీరు వుందంటూ షర్మిల ఎద్దేవా చేసారు. ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించడానికి వెళ్లిన తనను పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేసారని... ఎక్కడ మీ డొల్లతనం బయటపడుతుందోననే గొంతు నొక్కారని అన్నారు. మీరెంత అణచివేసినా నిజాలు అబద్దాలు కావన్నారు షర్మిల.
బేషరతుగా గవర్నర్ తమిళిసై, వైద్యులకు క్షమాపణ చెప్పాలని... ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని షర్మిల డిమాండ్ చేసారు. ప్రజారోగ్యంపై మీకు చిత్తశుద్ది ఉంటే వైద్యులు డిమాండ్ చేసినట్లు సచివాలయ భవనం ఉస్మానియా హాస్పిటల్ ఇవ్వాలి... లేదంటే మాటిచ్చినట్లు వెంటనే ట్విన్ టవర్స్ అయినా కట్టాలని వైద్యారోగ్య శాఖమంత్రి హరీష్ కు షర్మిల డిమాండ్ చేసారు.