వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని రాష్ట్రంలో పలుచోట్ల హిజ్రాలు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని రాష్ట్రంలో పలుచోట్ల హిజ్రాలు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. షర్మిల వెంటనే తమకు క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేశారు. అయితే తాజాగా ఈ వివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు. వైఎస్ షర్మిల బుధవారం.. సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌ను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పవన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. పవన్ పై బీఆర్ఎస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నీతులు చెప్పే కేసీఆర్.. ముందుగా బీఆర్ఎస్ శ్రేణులకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పాలని అన్నారు.
హిజ్రాలను అవమానించాలనేది తన ఉద్దేశం కానే కాదని వైఎస్ షర్మిల అన్నారు. అలాంటి ఉద్దేశం కూడా తనకు ఎప్పుడూ లేదని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న తనను అవమానించేలా మాట్లాడరని అన్నారు. అయితే ఆ మాటలు తట్టుకోలేక తాను ఎమ్మెల్యేలను మాటలు అన్నానని.. అయితే అప్పుడు కూడా తాను హిజ్రాలను అవమనించలేదని చెప్పారు. హిజ్రాలకు కూడా సమాజంలో ఒక గౌరవం ఉందని, విలువ సంపాదించుకున్నారని.. ఆ ఎమ్మెల్యేకు మాత్రం సమాజంలో గౌరవం లేదని చెప్పే క్రమంలో మాత్రమే తాను ఆ మాటలు మాట్లాడినట్టుగా తెలిపారు.
తన మాటల వల్ల హిజ్రాల మనోభావాలు దెబ్బతింటే.. బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని వైఎస్ షర్మిల అన్నారు. తాను హిజ్రాల బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తినని.. బీఆర్ఎస్ పాలనలో వారి గురించి ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన హిజ్రాల పక్షాల నిలపడతామని హామీ ఇచ్చారు. హిజ్రాలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా కృషి చేస్తుందని చెప్పారు.