
వారిద్దరీ రెండేళ్ల క్రితం ఓ పరీక్షా కేంద్రంలో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. దీంతో... అతను చెప్పినదంతా నిజమని ఆమె నమ్మింది. దీంతో.. అతనికి శారీరకంగా కూడా దగ్గరైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని యువతి అడగడంతో వదిలించుకోవడానికి.. ఏకంగా ఉరివేసి చంపేశాడు. ఈ సంఘటన అల్వాల్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అల్వాల్‌లోని ఓ కాలనీకి చెందిన నిరుపేద దంపతులకు కుమార్తె (17), కుమారుడు ఉన్నారు. బాలిక డిగ్రీ చదువుతోంది. దంపతులిద్దరూ ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి వచ్చిన డబ్బుతో కూతురిని చదివిస్తున్నారు. ఇంటర్ చదువుతున్నప్పుడు అల్వాల్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో బాలికకు దీపక్ (20) అనే యువకుడు పరిచయమయ్యాడు.
ఇద్దరూ పరస్పరం ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుంటానని బాలికకు దీపక్ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఇటీవల ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతో బాలిక ఫోన్ నంబరును బ్లాక్ చేయడంతో అతడిని గట్టిగా నిలదీసింది. సోమవారం బీహెచ్‌ఈఎల్ క్వార్టర్స్ రైల్వే ట్రాక్ సమీపంలో కలుద్దామని చెప్పింది. అదే రోజు దీపక్ అక్కడికి చేరుకున్నాడు.
ఇద్దరూ సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లారు. తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని అతడిని బాలిక నిలదీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. కోపంతో ఊగిపోయిన దిపక్.. బాలిక గొంతును ఆమె ధరించిన చున్నితోనే బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. రాత్రి అయినా కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా వెతికారు.
ఫలితం లేకపోవడంతో అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. బాలిక తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశారు. దీపక్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే బాలికను చంపేసినట్లు వెల్లడించాడు.