కేసీఆర్... నీ కరెంట్ కట్ చేయడం ఖాయం: మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక

By Arun Kumar PFirst Published Aug 4, 2021, 10:10 AM IST
Highlights

ఇటీవలే ఐపిఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడానికి రంగం సిద్దం చేసుకుంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.  

ఖమ్మం: బహుజన రాజ్యాధికారం కోసం ఐపిఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తున్నానని మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 8వ తేదీని బహుజన సమాజ్ వాదీ పార్టీలో ఆయన చేరనున్నట్లు ఓ ప్రకటన వెలువడింది. అయితే తాజాగా తాను బిఎస్పీలో చేరనున్నట్లు ప్రవీణ్ కుమార్ స్వయంగా ప్రకటించారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం ప్రవీణ్ కుమార్ పర్యటించారు. పాల్వంచ మండలం జగన్నాథపురంలో జరిగిన బహుజన శంఖారావం సభలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తాను ఎక్కడికి వెళితే అక్కడ ఇబ్బందులు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏం చేసినా తనను బడుగు బలహీన వర్గాల వద్దకు చేరుకోవడాన్ని ఆపలేరని ప్రవీణ్ అన్నారు. 

read more  రా'బంధు'లున్నంత కాలం తెలంగాణ గడ్డపై ఇదే పరిస్థితి: కేసీఆర్ సర్కార్ పై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలనం

'' కేసీఆర్...నేను పాల్గొనే సభలు, కార్యక్రమాలకు కరెంట్ కట్ చేయించి ఆటంకాలు కలిగున్నావ్. ఎక్కడికి వెళ్లినా ఇలాగే చేస్తున్నావ్. ఇలాంటివాటిని సహించబోం. ఇక మేమంతా కలిసి నీ కరెంట్ కట్ చేసే సమయం ఆసన్నమైంది'' అంటూ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. 

బడుగు బలహీన వర్గాల ప్రజలంతా ఐక్యంగా ఉధ్యమించి బహుజన రాజ్యాన్ని స్థాపించాలని ప్రవీణ్  సూచించారు. ఇందుకోసం తాను ఏం చేయడానికయినా సిద్దమేనన్నారు. ప్రజలు కట్టే పన్నులను సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా  ఖర్చుచేస్తున్నారని... ఇకపై ఇలాంటి నిర్లక్ష్య పాలనను సహంచబోమని ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. 

గతంలో కూడా సీఎం కేసీఆర్ పై, అధికార టీఆర్ఎస్ పార్టీపై ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్లుగా దళితులపై లేని ప్రేమ హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలోనే ఎందుకు పుట్టుకొచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు.  దళిత బంధు పేరుతో మరోసారి దళితులను పావుగా వాడుకోడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ పథకం కోసం ఖర్చుచేసే నిధులతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.  

ఈ ప్రభుత్వం ఇచ్చే తాయిలాల వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. దళిత బిడ్డల బ్రతుకులు బాగుపడాలంటే గులాబీ జెండా పోయి నీలి జెండా ఎగరాలన్నారు. బహుజన రాజ్య స్థాపనకోసం ఐక్యంగా పోరాడాలని ప్రవీణ్ కుమార్ సూచించారు. 
 

click me!