మంత్రి జగదీష్ రెడ్డిని విమర్శించిన వారు అరెస్ట్

First Published Dec 22, 2017, 3:03 PM IST
Highlights
  • సోషల్ మీడియాలో మంత్రిగారి చరిత్ర అంటూ పోస్టు
  • ముగ్గురిని గుర్తించి అరెస్టు చేసిన సూర్యాపేట పోలీసులు
  • తుంగతూర్తిలో మరో యువకుడి అరెస్టు

తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సూర్యాపేట పట్టణానికి చెందిన నాగేందర్, కళ్యాణ్, సంతప్ ఉన్నారు.

గత కొంతకాలంగా సూర్యాపేట మంత్రి గారి చరిత్ర ఇది అంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. అందులో జగదీష్ రెడ్డి అనేక నేరాలకు పాల్పడ్డట్లు, మోసాలు చేసినట్లు రాశారు. దీంతో సూర్యాపేట పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు యువకులను అరెస్టు చేయడం సూర్యాపేట పట్టణంలో సంచలనంగా మారింది. ముగ్గురు యువకుల మీద కేసులు నమోదు చేసినట్లు జిల్లా యస్.పి ప్రకాష్ జాదవ్ తెలిపారు.  

గతంలో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తే అరెస్టు చేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యాపేట మంత్రి జగదీష్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేశారంటూ ముగ్గురు యువకులను అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. రానున్న రోజుల్లో ఈ తరహా అరెస్టులు మరిన్ని పెరిగే అవకాశాలుంటాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

తుంగతూర్తిలో మరో పోరడు అరెస్టు

ఇదిలా ఉండగా మంత్రి జగదీష్ రెడ్డి మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణల మీద తుంగతూర్తి నియోజకవర్గంలో మరో యువకుడిని సైతం పోలీసులు అరెస్టు చేసినట్లు తుంగతూర్తి సిఐ పల్లె శ్రీనివాస్ తెలిపారు. తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన దయా యాదవ్ అనే యువకుడు ఫేస్ బుక్ లో మంత్రి జగదీష్ ప్రతిష్ట దిగజారేరీతిలో పోస్టు పెట్టినట్లు సిఐ తెలిపారు. దీంతో ఆ యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ మీడియాకు చెప్పారు.

 

click me!