KTR: సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందనీ, ప్రజాధనంతో కూలిపోయే నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అయితే, నువ్వు లీడర్ కాదు రీడర్ అంటూ రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ఎదురుదాడికి దిగారు.
KTR's counter to Rahul Gandhi: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వస్తుండటంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (కేటీఆర్) స్పందిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టును చూసి నేర్చుకోవాలన్నారు. అలాగే, బీఆర్ఎస్ సర్కారుపై రాహుల్ గాంధీ చేసిన అవినీతి ఆరోపణలను ఖండించారు. దేశంలో ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీ మనవడు వచ్చి ప్రజాస్వామ్యం గురించి సుద్దులు చెబుతున్నాడని మండిపడ్డారు. రాహుల్ గాంధీ అవినీతి ఆరోపణలను గురించి మాట్లాడుతూ.. పక్కన ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డిన పెట్టుకుని అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
అలాగే, "సీట్లను అమ్ముకునే రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్ష పదవులను అమ్ముకునే ఏఐసీసీ ఇంచార్జులు.. ఇలాంటి చిల్లరగాళ్లను పెట్టుకుని నువ్వు అవినీతి గురించి మాట్లాడితే ఎవ్వరు నమ్ముతారు?" అని రాహుల్ గాంధీకి కౌంటరిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్తానని రాహుల్ గాంధీ చెప్పడం గురించి స్పందిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కట్టించింది తమ నాయకుడు సీఎం కేసీఆర్ అనీ, ఆ ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు నీరు అందుతున్నదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ లీడరే కాదనీ, ఆయన ఒక రీడర్ అనీ, ఎవరేంది రాసిచ్చిన దాన్ని చదువుతారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల ఢిల్లీ దురహంకారానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో తప్పకుండా ప్రజలు గెలవాలని అన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసుకునీ, రాష్ట్ర అభివృద్ది ఆగకుండా ముందుకు సాగాలని అన్నారు.
కాగా, నేడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హెలికాప్టర్ లో కాళేశ్వరం చేరుకోనున్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ)ను సందర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, అంతకుముందు అన్నారం సరస్వతీ బ్యారేజీ గేటు నెంబర్ 28, 38 వద్ద లీకేజీ సంభవించింది. కాళేశ్వరం ప్రాజెక్టు రెండు గేట్ల వద్ద లీకేజీని అడ్డుకునేందుకు స్థానిక గ్రామస్థులు, ఇరిగేషన్ అధికారులు ఇసుక బస్తాలు పెట్టడంతో నీరు ఉప్పొంగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇక అక్టోబర్ 21న లక్ష్మీ బ్యారేజీలో పలు పిల్లర్లు కుంగిపోయాయి. ఈ అంశాన్ని పరిశీలించేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాలు బీఆర్ఎస్ సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి.