మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడిన నాయకుడు చలమల కృష్ణారెడ్డి బుధవారం బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయం వేడేక్కుతోంది. రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో దూసుకుపోతుంటే.. టిక్కెట్‌ను ఆశించి భంగపడిన నేతలు మాత్రం పార్టీ ఫిరాయింపుల పర్వానికి తెర తీస్తూ తన పార్టీలకు షాక్ ఇస్తున్నారు. రాజకీయ సమీకరణాలు మారుస్తున్నారు. నిజంగా ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో.. ఏ పార్టీ కండువా కప్పుకుంటారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.
రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారడంతో రాజకీయ విశ్లేషకులు కూడా అయోమయంలో పడుతున్నారు. తాజాగా మునుగోడులో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడిన నాయకుడు చలమల కృష్ణారెడ్డి బుధవారం బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.
వాస్తవానికి చలమల కృష్ణారెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. కానీ, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ కే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనయిన చలమల కృష్ణారెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం నాడు పలువురు నేతలు సమక్షంలో బీజేపీలో చేరారు. చలమలతో పాటు బోథ్ టిక్కెట్ ఆశిస్తున్న రాథోడ్ బాపురావు, ఎల్లారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్న సుభాష్ కూడా బీజేపీలో చేరారు. ఆయన పార్టీలకు వారు షాక్ ఇచ్చారు.
ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పలువురు నేతలు బీజేపీని వీడటంపై స్పందించారు. గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న చలమల తమ పార్టీలో చేరడంలో బీజేపీ కి మరింత బలం చేకూరిందని అన్నారు. చలమలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉందనీ, ప్రజల్లో కూడా ఆయన మంచి పేరు ఉందని అన్నారు.
మునుగోడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక కీలకమైనటువంటి ప్రాంతమని, రాజకీయంగా చైతన్యం గల పాంత్రమని అన్నారు. ఇక్కడి ప్రజా సమస్యల మీద మరి నెలల తరబడి పాదయాత్ర నిర్వహించిన వ్యక్తి కృష్ణారెడ్డి అనీ, ఆయనకు ప్రజా సమస్యల మీద అవగాహన ఉందని అన్నారు. నిరంతరం రాజకీయ క్షేత్రంలో ఉంటూ..బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసిన నేత అని చలమల ను కిషన్ రెడ్డి ప్రసంశించారు.