
వరంగల్ : ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు ఎక్కడ దూరం అవుతుందోనని మనోవేదనకు గురయిన యువకుడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ప్రియురాలితో ఫోన్ లో మాట్లాడుతూనే ప్రియుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
యువకుడి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... వరంగల్ మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన జున్న గణేష్(25) ఖోఖో క్రీడాకారుడు. చిన్నప్పటి నుండి క్రీడలంటే ఆసక్తి చూపించే ఇతడు జాతీయస్థాయి ఖోఖో క్రీడాకారుడిగా ఎదిగాడు. ఓ వైపు ఖోఖో ఆటగాడిగా రాణిస్తూనే కాకతీయ యూనివర్సిటీలో పిపిడి చదువుకుంటున్నాడు.
అయితే గణేష్ ఐనవోలు మండలానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఒకరంటే ఒకరు ఇష్టపడటంతో ఈ ప్రేమజంట పెళ్ళి చేసుకోవాలని భావించారు. ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు. కానీ ఇంతలోనే వీరి ప్రేమ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో తమ పిల్లని మరిచిపోవాలంటూ గణేష్ ను హెచ్చరించారు యువతి కుటుంబసభ్యులు.
సొంతూరు బొల్లికుంటకు వచ్చిమరీ యువతి కుటుంబసభ్యులు బెదిరించడం గణేష్ అవమానంగా భావించాడు. ఇకపై తనను ప్రియురాలితో కలవనివ్వరని... పెళ్లికి అంగీకరించని బాధపడ్డాడు. తన ప్రేమ విఫలమైందని తీవ్ర డిప్రెషన్ కు గురయిన గణేష్ చివరకు ప్రాణాలు తీసుకున్నాడు.
Read More మద్యానికి బానిసగా మారి వేధింపులు: భద్రాచలంలో కొడుకును చంపిన తండ్రి
నిన్న(సోమవారం) తల్లిదండ్రులు వ్యవసాయ పనులకోసం పొలానికి వెళ్లగా గణేష్ ఒక్కడే ఇంట్లో వున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలికి ఫోన్ చేసి మాట్లాడుతుండగా ఏమయ్యిందో తెలీదుగానీ ఒక్కసారిగా దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలితో మాట్లాడుతూనే సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి రాగా కొడుకు ఉరికి వేలాడుతూ కనిపించాడు.
గ్రామస్తులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గణేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గణేష్ ఉరేసుకున్న చోటే అతడి సెల్ ఫోన్ లభించిందని... కాల్ డాటా ఆధారంగా ఎవరితో మాట్లాడాడో తెలుసుకుంటామని తెలిపారు. పూర్తిగా దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)