
Munugodu by-election: మునుగోడు ఉపఎన్నిక రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచింది. ఇక్కడ రాష్ట్రంలోని ప్రధాని పార్టీలు ప్రజా స్వామ్యాన్ని, స్వతంత్య్ర ఎన్నికల ప్రక్రియను ఖూనీ చేయాశనీ, మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాలనే డిమాండ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తాజాగా పొలిటికల్ ఆస్పిరెంట్ ఫోరం కన్వీనర్ మల్లాడి క్రాంతి సైతం మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వివరాల్లోకెళ్తే.. మునుగోడు ఉప ఎన్నిక క్రమంలోనే అక్కడ మద్యం ఏరులై పారింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ.. ధన ప్రవాహం కోనసాగిందనేది బహిరంగా రహస్యం. ప్రజాస్వామ్య యుతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను అక్కడ పోటీపడిన కొన్ని పార్టీలు తుంగలో తొక్కుతున్నాయని మొదటి నుంచి ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికల్లో ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేసి ప్రలోబాలకు గురి చేసిన పలు పార్టీలకు సంబంధించిన అంశాల దృశ్యాలు సోషల్ మీడియా, మీడియా కథనాల్లో కనిపిస్తున్నాయనీ, ఆయా పార్టీల అభ్యర్థులపై అనర్హత వేటువేయడంలో పాటు మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాలని యంగ్ పొలిటికల్ ఆస్పిరెంట్ ఫోరం కన్వీనర్ మల్లాడి క్రాంతి డిమాండ్
చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక క్రమంలో ఆ నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలు, పరిస్థితులను గురించి వివరిస్తూ ఆయన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మునుగోడు ఉప ఎన్నిక రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. యంగ్ పొలిటికల్ ఆస్పిరెంట్ ఫోరం కన్వీనర్ మల్లాడి క్రాంతి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోయేలా వ్యవహరించిన పలు పార్టీల అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు.
మునుగోడు ఉప ఎన్నికలో పోటీ పడిన పలువురు అభ్యర్థులు ఎన్నికలు అంటేనే డబ్బులు, మద్యం పంపిణీ అనే పరిస్థితులను కల్పించారని ఆరోపించారు. 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ఇస్తేనే ఓటు వేస్తామనే పరిస్థితులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఆయన అన్నారు. మునుగోడు ఉపఎన్నికలను రద్దుచేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజును కోరారు. ఎన్నికల సంఘం అధికారిని కలిసిన వారిలో యంగ్ పొలిటికల్ ఆస్పిరెంట్ సభ్యులు ప్రశాంత్, అశోక్, ఉపఎన్నికల్లో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి బత్తుల దిలీప్ లు ఉన్నారు.
అలాగే, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సైతం మునుగోడు ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయాలని ఆయన ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. మునుగోడు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీలు ఓటర్లకు డబ్బులు పంచాయని.. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా వచ్చాయని మురళి తెలిపారు. దీనిని పరిగణనలోనికి తీసుకుని ఎన్నికను రద్దు చేయాలని ఆయన కోరారు. టీఆర్ఎస్, బీజేపీలు ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని.. ఇలాంటి పనులను ఇకనైనా కట్టిపెట్టాలని మురళీ కోరారు.