
రాష్ డ్రైవింగ్ ఒకరి ప్రాణాలు తీయగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. కాగా ఈ ఘటన మీద కేసు నమోదు చేయవద్దని ఇద్దరు ఎమ్మెల్యేలు పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఈ ఘటన హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెడితే... పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల చెబుతున్నదాన్ని బట్టి.. మలక్‌పేట్‌లో నివాసముండే రషీద్‌ఖాన్(19) విద్యార్థి. స్నేహితులతో కలిసి మద్యం తాగి వోక్స్ వ్యాగన్ పోలో (ఎపి29బిపి3444)కారులో అర్థరాత్రి దాటిన తరువాత ముగ్గురు స్నేహితులతో లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ ముందు నుంచి రింగ్ రోడ్డు వైపు వేగంగా వెల్తున్నాడు.
మొఘల్ నగర్ రింగ్ రోడ్డు పీవీ నర్సింహారావు ఎక్స ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 100 దగ్గరకు రాగానే కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న రషీద్‌ఖాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
ఇది గమనించిన స్థానికులు ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేయవద్దని ఇద్దరు పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి రావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ వివరాలను గోప్యంగా ఉంచే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు.