వేడి, ఉక్కపోతల నుంచి విశ్రాంతి.. వచ్చే ఐదు రోజుల్లో తెలంగాణలో వర్షాలు

By Siva KodatiFirst Published Apr 9, 2021, 10:51 PM IST
Highlights

ఎండ వేడి, ఉక్కపోత, వడగాల్పులతో అల్లాడిపోతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.  రాబోయే ఐదు రోజులు.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది.

ఎండ వేడి, ఉక్కపోత, వడగాల్పులతో అల్లాడిపోతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.  రాబోయే ఐదు రోజులు.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది.

శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై కనిపించి చిరుజల్లులు పడ్డాయి. భానుడి భగభగలతో ఉడికిపోతున్న జనానికి ఇది ఉపశమనం కలిగించింది. రాజధాని హైదరాబాద్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.

దీంతో ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గాయి. సంగారెడ్డిలోని రామచంద్రాపురం మండలంలో అత్యధికంగా 24.8 మి.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్ ప్రాంతంలో 14.5 మి.మీ, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 6.8 మి.మీ, బండ్లగూడలో 2.3 మి.మీల వర్షం కురిసింది.

ఆదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహాబూబాబాద్, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్‌లలో రాబోయే ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఏప్రిల్ 7న హైదరాబాద్‌లో 38.3 సెంటిగ్రేడ్‌ల వర్షపాతం నమోదైంది. ఆ మరుసటి రోజున ఉష్ణోగ్రత 37.5 డిగ్రీలకు పడిపోయింది. ఏప్రిల్ 9న 36.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో 36-37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం వుంటుందని ఐఎండీ అంచనా. 
 

click me!