
హైదరాబాద్ : పోలీస్ కావాలన్న కలే అతడిని బలితీసుకుంది. చేతికందివచ్చిన కొడుకు ఖాకీ డ్రెస్ లో ఇంటికి తిరిగొస్తాడని తలిదండ్రులు ఎదురుచూడగా... విగతజీవిగా తిరిగిరావడంతో కాటికి సాగనంపాల్సి వస్తోంది. పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. అంబర్ పేటలో జరుగుతున్న పోలీస్ దేహధారుడ్య పరీక్షలో పాల్గొన్న యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారంకు చెందిన లింగమల్ల మహేష్ (29) కబడ్డి క్రీడాకారుడు. రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డి పోటిలో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఇలా స్పోర్ట్స్ లో రాణిస్తూ పోలీస్ ఉద్యోగాన్ని పొందాలని భావించాడు. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణలో భారీగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడటంతో ఎలాగయినా ఉద్యోగాన్ని పొందాలన్న పట్టుదలతో మహేష్ హైదరాబాద్ కు వచ్చాడు. ఇక్కడే కోచింగ్ తీసుకుని కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణడయ్యాడు. దీంతో ఈవెంట్స్ కోసం హైదరాబాద్ లోనే వుంటూ బాగా సాధన చేసాడు.
Read more తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ లో కుట్రలు...: అద్దంకి దయాకర్ సంచలనం
నిన్న (శనివారం) అంబర్ పేటలోని సిసిఎల్ గ్రౌండ్ లో ఈవెంట్స్ లో పాల్గొనేందుకు హాజరయ్యాడు మహేష్. ఈ క్రమంలోనే అతడు అధకారులు నిర్వహించిన 1600 మీటర్ల పరుగుపందెంలో పాల్గొన్నారు. నిర్ణీత సమయానికి పరుగును పూర్తిచేసి తదుపరి ఈవెంట్స్ కు అర్హత సాధించాడు. అయితే పరుగుపందెం ముగిసిన కొద్దిసేపటికే అతడు తీవ్ర అస్వస్థతకు గురయి మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే పోలీస్ అధికారులు అతన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం సమయంలో మహేష్ ప్రాణాలు కోల్పోయాడు.
మహేష్ మృతివార్తలు పోలీసులు అతడి తల్లిదండ్రులకు తెలియజేయగా వారు హాస్పిటల్ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కొడుకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్వస్థలానికి తరలించారు. మహేష్ మృతితో మహాముత్తారంలోనూ విషాదం నెలకొంది.