Hyderabad Suicide: సైకిల్ రిపేర్ కు తల్లిదండ్రులు డబ్బులివ్వలేదని... బాలుడు బలవన్మరణం

By Arun Kumar PFirst Published Jan 6, 2022, 10:19 AM IST
Highlights

 సైకిల్ రిపేర్ చేసుకోడానికి డబ్బులు అడిగినా తల్లిదండ్రులు ఇవ్వలేదన్న చిన్న కారణంతో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

మెహిదీపట్నం: చిన్న చిన్న విషయాలకే హత్యలు (murders) చేయడం, ఆత్మహత్య (suicides)లు చేసుకోవడం వంటి ఘటనలు ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయాయి. తల్లిదండ్రుల మందలించారని, చదువులో వెనబడ్డామని ఇలాంటి చిన్న చిన్న కారణాలతో నేటి విద్యార్థులు, యువత బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) లో ఇలాగే ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  

బాధిత తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లంగర్ హౌస్ లోని ప్రశాంత్ నగర్ లో ఓ కుటుంబం నివాసముంటోంది. ఉన్నదాంట్లోనే ముగ్గురు పిల్లలతో కలిసి భార్యాభర్తలు ఆనందంగా జీవించేవారు. వీరి పెద్ద కుమారుడు (16) నివాసానికి దగ్గర్లోని ఓ పాఠశాలలో చదువుకుంటునేవాడు. ప్రతిరోజూ సైకిల్ పై స్కూల్ కు వెళ్లేవాడు. 

అయితే మంగళవారం సైకిల్ పాడయిపోవడంతో స్కూల్ కు వెళ్లలేకపోయాడు. దీంతో సైకిల్ ను రిపేర్ చేయించుకోడానికి తండ్రిని డబ్బులు అడిగాడు. సాయంత్రం వచ్చాక ఇస్తానని చెప్పి తండ్రి పనికి వెళ్లిపోయాడు. ఇలా అడిగినవెంటనే తండ్రి డబ్బులివ్వకపోవడంతో బాలుడు దారుణానికి ఒడిగట్టాడు.  

read more  భర్త స్నేహితుడు, మరో ఇద్దరితో మహిళ సంబంధం.. రోకలిబండతో కొట్టి, దుప్పట్లో చుట్టి, నిర్మానుష్య ప్రదేశంలో పడేసి..

చీరను ఊయలగా కట్టి చిన్నకొడుకును అందులో వుంచి దుస్తులు ఉతకడానికి తల్లి డాబాపైకి వెళ్ళింది. దీంతో తమ్ముడిని కిందపడుకోబెట్టి ఊయలగా కట్టిన చీరతో బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి కిందకువచ్చి చూసేసరికి చీర మెడకు బిగుసుకుని కొడుకు కొనఊపిరితో వుండటాన్ని గమనించింది. 

బాలుడిని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించినా ఫలితంలేకుండా పోయింది. మంగళవారం రాత్రి బాలుడు హాస్పిటల్ లోనే మృతిచెందాడు. బాలుడి మరణవార్త కుటుంబంలో విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

read more  కన్నకూతురిపై రెండోసారి తండ్రి అత్యాచారం.. మద్యం మత్తులో కామం తలకెక్కి...

ఇక సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నాడని తల్లి మందలించడంతో ఓ బాలుడు  ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. తాడిపత్రిలోని ఆర్ఆర్ నగర్ కు చెందిన లక్ష్మి భర్త చనిపోవడంతో ఒక్కగానొక్క కొడుకు కోసమే జీవించేది. ఆమె కొడుకు తలారి శ్రీనివాసులు(17) పుట్లూరు మండలంలోని ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదివేవాడు.

అయితే శ్రీనివాసులు ఎక్కువగా సెల్ ఫోన్ వాడుతుండటంతో ఎక్కడ చదువు పాడవుతుందోనని తల్లి ఆందోళనకు గురయ్యింది. దీంతో సెల్ ఫోన్ వాడకాన్ని కాస్త తగ్గించాలని కొడుకును మందలించింది. దీంతో తీవ్ర  మనస్థాపానికి గురయిన శ్రీనివాసులు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.  పుట్లూరు రోడ్డు రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే భర్తను కోల్పోయి, ఇప్పుడు ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి సదరు మహిళ ఒంటరిగా మారింది. 

ఇలా చిన్నచిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటూ తల్లిదండ్రులకు కడుపుశోకాన్ని మిగిలిస్తున్నారు మైనర్లు. కాబట్టి పిల్లల కదలికపై కన్నేసి వుంచాలని... వారి ప్రవర్తనలతో మార్పు కనిపిస్తే అందుకు కారణాలను తెలుసుకోవాలని నిపుణులు తల్లిదండ్రులు సూచిస్తున్నారు. 

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)

click me!