ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీఆర్ఎస్ టిక్కెట్ల జాబితాను విడుదల చేసే సమయంలో ఈ ఫోటో బయటకు రావడం కలకలం రేపుతుంది.
ఖమ్మం: వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేపు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ ఫోటో మదన్ లాల్ కు రాజకీయంగా ఇబ్బందిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
వైరా టిక్కెట్టు తనకే దక్కుతుందని సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ ధీమాగా ఉన్నారు.అయితే ఈ టిక్కెట్టు కోసం మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కూడ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు మీడియా రిపోర్టు చేసింది. సోషల్ మీడియాలో కూడ ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఫోటోలు స్థానికంగా ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో కూడ చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయాన్ని అవకాశంగా తీసుకున్న రాజకీయ ప్రత్యర్థులు మదన్ లాల్ పై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వారికి టిక్కెట్టు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.అయితే ఈ ఫోటోలు నిజమైనవా, మార్ఫింగ్ ఫోటోలా అనేది తేలాల్సి ఉంది. మరో వైపు ఈ ఫోటోలను మార్ఫింగ్ చేశారని మదన్ లాల్ వర్గీయులు చెబుతున్నారు.వైరా టిక్కెట్టు మదన్ లాల్ కు దక్కకుండా చేసేందుకు గాను కుట్ర చేశారని ప్రత్యర్ధులపై మదన్ లాల్ వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. టిక్కెట్ల జాబితా విడుదల చేయడానికి కొన్ని గంటల ముందు ఈ ఫోటోలు మీడియాతో పాటు,సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.