
షాంఘైలో జరిగిన పోటీల్లో లాజిస్టిక్స్ అండ్ ఫ్రైట్ ఫార్వార్డింగ్ విభాగంలో మెహ్రున్నిసా అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన నైపుణ్య శిక్షణ పొందిన పోటీదారులతో పోటీపడి సిల్వర్ మెడల్ సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ యువతి ఈ ఘనత సాధించడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. మరోవైపు క్యాబినెట్ మేకింగ్ విభాగంలో కె. యశ్వంత్ చారి మెడల్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నారు. తెలంగాణ నుంచి పోటీలో పాల్గొన్న ముగ్గురిలో ఇద్దరు గుర్తింపు పొందడం విశేషంగా నిలిచింది.
రాష్ట్ర యువత సాధించిన విజయంపై శక్తి, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి హర్షం వ్యక్తం చేశారు. మెహ్రున్నిసా, కె. యశ్వంత్ చారిని అభినందించారు. ప్రపంచస్థాయి వేదికపై తెలంగాణ ప్రతిభను చాటడం రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. యువతలో ఉన్న నైపుణ్యాన్ని సరైన శిక్షణ, అవకాశాలతో మరింతగా తీర్చిదిద్దితే అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి మరిన్ని విజయాలు సాధించవచ్చని మంత్రి తెలిపారు.
షాంఘైలో జరిగిన వరల్డ్‌స్కిల్స్–2026లో భారత్ కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. భారత్ 10వ స్థానంలో నిలిచి ఆరు సిల్వర్ మెడల్స్, 20 మెడల్ ఫర్ ఎక్సలెన్స్ అవార్డులు సాధించింది. 2024లో ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో భారత్ 13వ స్థానంలో నిలవగా.. ఈసారి 10వ స్థానానికి చేరుకుంది. దేశ యువతలో నైపుణ్య సామర్థ్యం పెరుగుతోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనమని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో భారత్ తరఫున 70 మంది పోటీదారులు పాల్గొన్నారు. మొత్తం 63 నైపుణ్య విభాగాల్లో భారత యువత తమ ప్రతిభను ప్రదర్శించింది. ఆధునిక సాంకేతికత, అడ్వాన్స్‌డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్, డిజిటల్, క్రియేటివ్, సర్వీస్ రంగాలకు సంబంధించిన విభాగాల్లో పోటీలు జరిగాయి. ఆయా రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించింది.
తెలంగాణ నుంచి ముగ్గురు పోటీలో పాల్గొంటే ఇద్దరు పతకం, ప్రత్యేక గుర్తింపు సాధించడం రాష్ట్ర యువతలో ఉన్న ప్రతిభను చాటుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గత వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో తెలంగాణకు కాంస్య పతకం లభించగా.. ఈసారి సిల్వర్ మెడల్‌తో పాటు మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించడం ప్రత్యేక విజయమని పేర్కొన్నారు. యువతకు అత్యుత్తమ శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలతో అనుసంధానం, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే అవకాశాలు అందిస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ ఫలితాలు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని మంత్రి పేర్కొన్నారు.