ఉచితంగా జర్మన్ భాషా శిక్షణ.. తెలంగాణ యువ‌త‌కు విదేశాల్లో ఉద్యోగాలు పొందే ఛాన్స్

Published : Sep 24, 2026, 05:57 PM IST
Telangana

సారాంశం

Telangana: విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునే తెలంగాణ యువతకు అవసరమైన నైపుణ్యాలు, విదేశీ భాషల్లో శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కొడంగల్‌ ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో ఉచిత జర్మన్‌ భాషా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

టామ్‌కామ్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

శక్తి, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్‌ వెంకటస్వామి ఆదేశాల మేరకు టామ్‌కామ్‌ ఈ ఉచిత జర్మన్‌ భాషా శిక్షణను ప్రారంభించింది. విదేశాల్లో ముఖ్యంగా జర్మనీలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే నర్సింగ్‌ అభ్యర్థులకు ఈ శిక్షణ ఉపయోగపడనుంది. శిక్షణలో భాగంగా అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను కూడా అందించారు.

100 మంది నర్సింగ్‌ అభ్యర్థుల నమోదు

కొడంగల్‌ ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నర్సులు, నర్సింగ్‌ విద్యార్థులు మంచి ఆసక్తి చూపారు. ఇప్పటికే సుమారు 100 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. విదేశీ ఉద్యోగాల కోసం అవసరమైన భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా శిక్షణ అందించనున్నారు. భాషపై పట్టు సాధించడం ద్వారా విదేశీ సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు.

భాషా శిక్షణ నుంచి ఉద్యోగం వరకు సహకారం

విదేశీ ఉద్యోగాల కోసం కేవలం భాష నేర్పడంతోనే కార్యక్రమాన్ని పరిమితం చేయకుండా.. అభ్యర్థులకు సర్టిఫికేషన్‌, విదేశీ సంస్థలతో అనుసంధానం, ఉద్యోగ నియామకం వరకు అవసరమైన సహకారం అందించేలా టామ్‌కామ్‌ కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ విధానం ద్వారా విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకునే యువతకు ఒకే ప్లాట్ ఫామ్ ద్వారా అవసరమైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

హైదరాబాద్‌లో తొలి టెలీ జర్మన్‌ పరీక్షా కేంద్రం

తెలంగాణలోనే తొలి టెలీ జర్మన్‌ భాషా పరీక్షా కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జర్మన్‌ భాషా పరీక్షలను రాష్ట్రంలోని అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. విదేశీ ఉపాధి అవకాశాలకు అనుగుణంగా వివిధ విద్యా, వృత్తిపరమైన నేపథ్యాలకు చెందిన యువతకు జర్మన్‌, జపనీస్‌ తదితర విదేశీ భాషల్లో శిక్షణ అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

విదేశీ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలి

తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విదేశీ భాషా శిక్షణతో పాటు విదేశీ ఉద్యోగ అవకాశాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు టామ్‌కామ్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్‌, టామ్‌కామ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏ. కాంతి వెస్లీ, ఐఏఎస్‌ సూచించారు. అర్హతలు, శిక్షణ కార్యక్రమాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన మరిన్ని వివరాలను టామ్‌కామ్‌ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vinayaka Nimajjanam : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 30 వేల మంది పోలీసులతో పహారా
తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు...గ్రౌండ్ లెవల్లో అధికారుల అలర్ట్ | Heavy Rains Alert