Huzurabad Bypoll: ఆ పార్టీల డబ్బులు అందలేదంటూ ఓటర్ల ఆందోళన... గొడవకుదిగిన మహిళలు (వీడియో)

By Arun Kumar PFirst Published Oct 29, 2021, 11:42 AM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నికలో ధన ప్రవాహం ఏ స్థాయిలో సాగుతుందో తెలిపే సంఘటన ఇది. తమకు డబ్బులు తక్కువగా ఇస్తున్నారంటూ కొందరు మహిళలు గొడవకు దిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

కరీంనగర్: హుజురాబాద్ లో రేపు(శనివారం) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీ ఓట్ల కొనుగోలు చేపడుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటుకు ఆరువేల నుండి పదివేలు, కొన్నిచోట్ల రూ.20వేలు కూడా పంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమకు రాజకీయ పార్టీలు పంచే డబ్బులు అందడం లేదని ఓటర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారంటే ఈ ఉపఎన్నికలో ధనప్రవాహం ఏస్థాయిలో వుందో అర్థంచేసుకోవచ్చు. 

భారీఎత్తున డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే వీణవంక మండలం రెడ్డిపల్లి, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో కొందరు ఇతర ప్రాంతాల నుండి వచ్చి డబ్బులు పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో నలుగురిని అదుపులో తీసుకొన్న పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

వీడియో


 
ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో తమకు డబ్బులు రాలేదని ఓటర్ల ఆందోళనకు దిగుతున్నారు.   ఓటుకు పదివేలు ఇస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో కొందరు మహిళలు తమకు డబ్బులు అందలేదంటూ రోడ్డెక్కారు. వీణవంక మండలం గంగారం, ఇల్లంతకుంట మండలం బుజునూరు గ్రామానికి చెందిన మహిళలు టీఆర్ఎస్ పార్టీ డబ్బులు రాలేదంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులతోనే వారు వాగ్వాదానికి దిగారు. 

read more  Huzurabad bypoll: ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై ఈసీ ఆరా

హుజురాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు. దీంతో ఈ రెండు పార్టీలు భారీగా డబ్బులు పంచుతున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియోలతో ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదుచేసింది. దీంతో హుజురాబాద్ లో ధన ప్రవాహంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసినట్లు తెలుస్తోంది. 
 
బిజెపి కమలంపువ్వు, అభ్యర్థి ఈటల రాజేందర్ ఫోటోలతో కూడిన కవర్లలో డబ్బులు పెట్టి పంచుతున్నట్లుగా  కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే టీఆర్ఎస్ పార్టీ భారీగా డబ్బులు పంచుతోందని... ఆ డబ్బులు తమకు అందలేదని కొందరు మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ TRS, BJP లు ఓటర్లకు ప్రలోభాలకు గురిచేస్తున్నాయని... ఓట్లను నోట్లతో కొనాలని చూస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 

read more  Huzurabad Bypoll:నోట్లిస్తేనే ఓట్లు... టీఆర్ఎస్ పంచే డబ్బులు అందలేదంటూ రోడ్డెక్కిన మహిళలు 

రేపు ఉదయం నుండి హుజురాబాద్ లో పోలింగ్ ప్రారంభం కానుంది. దీంతో ఇవాళ రాత్రి డబ్బుల పంపిణీ మరింత జోరుగా సాగనుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మద్యం ఏరులై పారుతోంది. విందులు, వివిధ రకాల వస్తువుల పంపిణీ కూడా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అన్ని పార్టీలు, అభ్యర్థులు ఇలాగే ఓటర్లను ధనం, మద్యంతో కొనాలని చూస్తున్నాయి. 

ప్రధాన పార్టీలన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేయడంతో పాటు ప్రలోభాలకు పాల్పడటంతో హుజురాబాద్ లో రేపు అధికంగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదేక్రమంలో ఉద్రిక్తతలు కూడా చోటుచేసుకునే అవకాశం వుండటంతో ఈసీ, పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బందోబస్తును ఏర్పాటు చేసారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన ఏర్పాటు చేసారు. 
 

click me!