హనుమకొండ ప్రసూతి ఆస్పత్రిలో ఘోరం.. బీర్లతో మహిళా సిబ్బంది విందులు, చిందులు...

By SumaBala Bukka  |  First Published Oct 27, 2022, 12:50 PM IST

ఓ ప్రభుత్వ మెటర్నరీ ఆస్పత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి మహిళా సిబ్బంది పార్టీ పేరుతో ఆస్పత్రిలోనే బీరు తాగి చిందులు వేశారు.


హనుమకొండ : అది ప్రసూతి ఆసుపత్రి. నిత్యం వందలాది మంది గర్భిణీలు చికిత్స కోసం వస్తుంటారు. వైద్యులతో పాటు, సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకుని సేవలు అందించాల్సి ఉంటుంది.  అలాంటిది ఇద్దరు మహిళా సిబ్బంది తమ బాధ్యతలు మరిచి వ్యవహరించారు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బీర్లు తాగి  విందు చేసుకున్నారు. వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా సిబ్బంది ఇటీవల మరో ఇద్దరు మహిళలను పిలిపించి ఓ గదిలో బీరు తాగి చిందేశారు.

పుట్టిన రోజు వేడుకల పేరిట సాయంత్రం వేళ తమ గదిలో పార్టీ చేసుకున్నారు. విందు చేసుకునే దృశ్యాలను ఆస్పత్రిలోని రోగుల బంధువులు వీడియో తీశారు. ఈ ఘటన ఆస్పత్రిలోని ఇతర సిబ్బందికి తెలిసింది. ఆస్పత్రి ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో.. వారు మహిళా సిబ్బందిని పిలిపించి, మందలించి వదిలేసినట్లు సమాచారం. ఆసుపత్రిలో ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఆస్పత్రి పర్యవేక్షకుల డాక్టర్ విజయలక్ష్మి వివరణ కోరగా వారు విందు ఏర్పాటు చేసుకున్నట్లు తమ దృష్టికి రాగానే పిలిచి గట్టిగా హెచ్చరించామని తెలిపారు. 
 

Latest Videos

click me!