నాకు రూ.100కోట్లు, నాతో చేరేవారికి రూ. 50 కోట్ల ఆఫర్.. చేరకపోతే ఈడీ, సీబీఐ కేసులు.. రోహిత్ రెడ్డి

By SumaBala Bukka  |  First Published Oct 27, 2022, 12:18 PM IST

తనకు వందకోట్లు, తనతో వచ్చేవారికి 50 కోట్లు ఆఫర్ చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. 


హైదరాబాద్ : టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారంలో ముగ్గురిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీకి చెందిన సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి(ఏ1), హైదరాబాద్కు చెందిన నందకిషోర్ (ఏ2), తిరుపతికి చెందిన సింహాయాజి (ఏ3)పై కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ ఏసిపి తెలిపారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో కీలక అంశాలను పోలీసులు పొందుపరిచారు.

బిజెపిలో చేరితే రూ.100  కోట్లు ఇప్పిస్తామని సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి ఆఫర్ చేశారని.. నందకిషోర్ మధ్యవర్తిత్వంతో ఫామ్ హౌస్ కు సతీష్ శర్మ, సింహాయాజి వచ్చారని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. టిఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపి లో చేరితే రూ.100 కోట్లు ఇస్తామని బిజెపి తరఫున వారు హామీ ఇచ్చినట్లు పైలట్ రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.

Latest Videos

ఆ పార్టీలో చేరకపోతే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేస్తామని బెదిరించినట్లు ఆయన పేర్కొన్నట్లు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. బీజేపీ లో చేరితే సెంట్రల్ సివిల్ కాంట్రాక్టర్ తో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పిన విషయాన్ని పోలీసులు పేర్కొన్నారు. తనకు రూ.100కోట్లు, తనతో ఆ పార్టీలో చేరే వారికి రూ.50కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్లు రోహిత్ రెడ్డి తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎమ్మెల్యేలకు ప్రలోభాలు: చండూరులో టీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ నిరసనలు

కాగా, టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు ప్రయత్నించిన ముగ్గురు చేసిన ఫోన్ కాల్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ఎవరికి ఫోన్ చేశారు? అనే అంశానికి  ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు గంటన్నర పాటు సాగిన వీరి మంతనాలు నిఘా వర్గాలు, పోలీసు అధికారులు ప్రత్యేక కెమెరాల ద్వారా రికార్డు చేశారు. హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి లను ప్రలోభ పెట్టడానికి రంగంలోకి దిగినట్టుగా చెబుతున్న సింహ యాజులు స్వామి, రామచంద్ర భారతి, నందకుమార్ లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి, ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించడానికి పోలీసులు భారీ స్కెచ్ వేశారు. 

రోహిత్ రెడ్డి ద్వారానే ఈ సమావేశం మొయినాబాద్ లోని అజీజ్ నగర్ లో ఉన్న తన ఫాంహౌస్లో జరిగేలా కథ నడిపారు. బుధవారం సాయంత్రం సమావేశం కావాలని వీళ్లు మంగళవారం ఉదయమే నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేల ద్వారా విషయం తెలుసుకున్న నిఘా అధికారులు,  పోలీసులు మంగళవారం సాయంత్రం ఫామ్ హౌస్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో సమావేశం జరిగేందుకు ఉద్దేశించిన హాల్ తో పాటు ఆరు చోట్ల రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ సమావేశం జరిగినా ఆద్యంతం రికార్డు అయ్యేలా సిద్ధం చేశారు. 

బుధవారం ఉదయం నుంచి పోలీసులు, నిఘా వర్గాలు మారువేషాల్లో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నా..  సాయంత్రం ఈ సమావేశం మొదలైన వెంటనే దాడి చేయలేదు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగేవరకు, వారి మాటలతో పాటు అక్కడ జరిగే ప్రతి వ్యవహారం రికార్డు కావడం కోసం వేచి చూశారు. ఆ పై దాడి చేసి ముగ్గురితో పాటు డ్రైవర్ తిరుపతి అదుపులోకి తీసుకున్నారు.

click me!