
తెలంగాణ సర్కారు రైతాంగానికి ఎన్ని వరాలిచ్చినా అన్నదాతల ఆత్మహత్యలు ఆగడంలేదు. ప్రపంచంలోనే ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఇక్కడ రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. తాజాగా మహిళా రైతు ఆత్మహత్య చోటుచేసుకుంది.
తాజాగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన బడారి గట్టవ్వ(45) అనే మహిళారైతు అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గట్టవ్వ మూడు ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా భారీ వర్షాలకు విత్తనాలు దెబ్బతిని మొలకెత్తలేదు.
తిరిగి విత్తనాలు కొనే ఆర్థిక స్థోమత లేక గతంలో చేసిన అప్పులను తీర్చే పరిస్థితి లేకపోవడంతో వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సైదాపూర్ ఎస్సై శ్రీధర్ పేర్కొన్నారు.