గురుకుల మెయిన్స్ వాయిదా ఇందుకేనా ?

First Published Jun 20, 2017, 12:09 PM IST
Highlights

గురుకుల మెయిన్స్ పరీక్షను టిఎస్సీఎస్సి 15 రోజుల  పాటు వాయిదా వేసింది. పెద్ద  సంఖ్యలో అభ్యర్థుల నుంచి వస్తున్న వినతుల మేరకు, విద్యార్థి సంఘాల కోరిక  మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. నిజానికి టిఎస్సీఎస్సీ చెబుతున్న మాటలో వాస్తవమెంత? అసలు విషయం వేరే ఉందా?

ఈనెల  29నుంచి 30 వరకు జరగాల్సిన గురుకుల పిజిటి మెయిన్స్ పరీక్షను జులై 18 నుంచి 20 వరకు జరపనున్నట్లు ప్రకటించింది టిఎస్సీపిఎస్సీ. అలాగే జులై 4 నుంచి 6 వరకు జరగనున్న టిజిటి మెయిన్స్ పరీక్షను జులై 20 నుంచి 22వరకు జరపనున్నట్లు సవరించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు జులై 18న జరపనున్నట్లు ప్రకటించింది.

 

ప్రిపరేషన్ కోసం  సమయం కావాలని అభ్యర్థులు కోరినందుకు, విద్యార్థి సంఘాల డిమాండ్ మేరకు పరీక్ష తేదీలను వాయిదా వేశామని టిఎస్సీపిఎస్సీ చెబుతున్న వాదనను అభ్యర్థులు  తోసిపుచ్చుతున్నారు. మే 31న ప్రలిమినరీ పరీక్ష జరిపిన టిఎస్సీపిఎస్సీ 20 రోజులు గడుస్తున్నా ఎందుకు ఫలితాలు విడుదల చేయలేదని ప్రశ్నిస్తున్నారు  అభ్యర్థులు. 

 

ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం జరగినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. రిజల్ట్స్ ఇవ్వకుండా పరీక్షలు పెడితే అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదముందని గ్రహించిన టిఎస్సీపిఎస్సీ వాయిదా నిర్ణయం తీసుకుందని అనుమానిస్తున్నారు. కానీ అసలు విషయాన్ని దాచిపెట్టి అభ్యర్థుల కోరిక మేరకు వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారన్న విమర్శలున్నాయి.

 

నిజానికి గురుకుల ప్రలిమినరీ పరీక్షలు జరిపి 20 రోజులు గడుస్తున్నా ఎందుకు ఫలితాలు విడుదల చేయలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 85వేల ఓఎంఆర్ సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయడానికి అంత సమయం సరిపోదా  అన్న కోణంలో అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. రోజుకు పదివేల పేపర్లు దిద్దినా పది రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదని అభ్యర్థులు అంటున్నారు. అయినా 20 రోజులు గడుస్తున్నా ఫలితాలు ఎందుకు వెలవరించలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఫలితాలు రాకముందే మెయిన్స్ జరడం ఇబ్బందిగా మారుతుందన్న ఉద్దేశంతోనే మెయిన్ష్ వాయిదా వేశారని ప్రచారం సాగుతోంది.

 

అయితే మరో వారం రోజులపాటు ఫలితాల వెల్లడికి సమయం పట్టే అవకావం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అప్పటికి కానీ అర్హులెవరో, అనర్హులెవరో  తేలిపోనుంది. ఫలితాలు వెలువడేవరకు ఈ టెన్షన్ లైఫ్ కొనసాగుతూనే ఉంటుందని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు.

click me!