మంగళసూత్రం తీసివ్వమంటూ.... మహిళా రైతులతో ప్రభుత్వాధికారి అసభ్య ప్రవర్తన (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 3, 2021, 12:59 PM IST
Highlights

పల్లె ప్రకృతి వనం  కోసమంటూ తమ భూములను స్వాధీనం చేసుకోడానికి వచ్చిన ఓ ప్రభుత్వ అధికారి మహిళా రైతులతో అసభ్యంగా ప్రవర్తించాడని పెద్దపల్లి జిల్లా ఖమ్మంపల్లి, అడవి శ్రీరాంపూర్ గ్రామాల రైతులు ఆరోపించారు. 

పెద్దపల్లి:  ప్రకృతి వనాల పేరుతో తమ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి, అడవి శ్రీరాంపూర్ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంపైనే ఆధారపడిన తమను రోడ్డున పడేయవద్దని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భూములను స్వాధీనం చేసుకోడానికి వచ్చిన అధికారులు మహిళా రైతులతో అభ్యంతకరంగా ప్రవర్తించారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ వ్యవహారానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.  పెద్దపల్లి జిల్లా ఖమ్మంపల్లి, అడవి శ్రీరాంపూర్ గ్రామాలకు చెందిన 17 మంది దళితులు,12 మంది బిసి రైతులు సర్వే నెంబర్ 615 లో భూమిని కలిగివున్నారు. గత 30ఏళ్లుగా వీరు ఆ భూమిని సాగుచేసుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పట్టాదార్ పాస్ పుస్తకాలను కూడా జారీ చేసింది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆ భూమిలో సోయ, కంది పంటను వేసుకున్నారు రైతులు. 

వీడియో

అయితే ఈ రైతులకు చెందిన భూమిలో పల్లె ప్రకృతి వనం మెగా పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వెంటనే పనులు ప్రారంభించడానికి సిద్దమైన అధికారులు యంత్రాలను తీసుకుని భూమిని చదును చేయడానికి ప్రయత్నించారు. దీన్ని రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే రైతులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 

అధికారులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని కొందరు మహిళా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భర్త చనిపోవడంతో నానా కష్టాలు పడి వ్యవసాయం చేస్తున్నానని... ఇప్పుడు ఈ భూమిని కూడా గుంజుకుంటే కుటుంబం రోడ్డున పడుతుందని మహిళా రైతు నర్సమ్మ ఎంపివొ వేణు మాధవ్ తో మొర పెట్టుకుంది. అయితే అతడు సాటి మనిషిగా ఆమె ఆవేదనను అర్థం చేసుకోకపోగా నీవు చనిపోతే ఇన్సూరెన్స్ ఇప్పిస్తానని  ఎగతాళిగా మాట్లాడినట్లు బాధితురాలు నర్సమ్మ తెలిపింది. 

read more  రా'బంధు'లున్నంత కాలం తెలంగాణ గడ్డపై ఇదే పరిస్థితి: కేసీఆర్ సర్కార్ పై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలనం

ఇక మరో మహిళా రైతు మెడలోంచి మంగళసూత్రం లాక్కోడానికి సదరు అధికారి ప్రయత్నించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. నీ మెడలోని పుస్తెల తాడు ఇస్తే అది అమ్మి చికెన్ వండిపెడతామని ఎంపివో అన్నట్లు మహిళా రైతు స్వరూప తెలిపారు. ఇలా అసభ్యకరంగా ప్రవర్తించిన  ఎంపివొ బైరి వేణు మాదవ్ పై స్వరూప ముత్తారం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపివొ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు మంథని సిఐ సతీష్ తెలిపారు.

ఇక అదికారుల ఫిర్యాదు మేరకు నలుగురు మహిళలు, ఎనిమిది పురుషులపై ముత్తారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఒక రైతును పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. 
 

click me!