హుజురాబాద్ ఉపఎన్నిక ఎఫెక్ట్... సూసైడ్ చేసుకున్న నిరుద్యోగి ఫ్యామిలీకి పోటాపోటీగా ఆర్థిక సాయం

By Arun Kumar PFirst Published Aug 3, 2021, 10:52 AM IST
Highlights

ఉద్యోగ ప్రయత్నంలో విఫలమై చివరకు బలవన్మరణానికి పాల్పడ్డ జమ్మికుంట యువకుడు షబ్బీర్ కుటుంబానికి అన్నీ రాజకీయ పార్టీల నాయకులు ఆర్థిక సాాయం చేస్తున్నారు.  

హుజురాబాద్: ఐటిఐ చేసి, డిగ్రీ చదివి, ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ తీసుకున్నా కూడా ఉద్యోగం రావడంలేదన్న మనస్థాపంతో తెలంగాణలో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ఈ విషాదం చోటుచేసుకుంది. జమ్మికుంట రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకింద పడి మహ్మద్ షబ్బీర్(26) అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యపై  స్పందించిన బిజెపి, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.  

స్థానిక బిజెపి నాయకులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మృతుడు షబ్బీర్ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం ఈటల హాస్పిటల్ లో వుండటంతో ఆయన తరపున మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ షబ్బీర్ కుటుంబానికి ఈ సాయాన్ని అందించారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా షబ్బీర్ భార్యకు రూ.3లక్షలు అందించారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా షబ్బీర్ కుటుంబానికి రూ.50వేలు ఆర్థిక సాయం అందించారు.  

read more  రా'బంధు'లున్నంత కాలం తెలంగాణ గడ్డపై ఇదే పరిస్థితి: కేసీఆర్ సర్కార్ పై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలనం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సిర్సెడు గ్రామానికి చెందిన షరీఫ్ అనే యువకుడు తొమ్మిది నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న షరీఫ్ స్వరాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా కాలంగా నిరీక్షించాడు. 

ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ తీసుకున్న షరీఫ్ కొన్ని రోజులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నాడు. అయితే ఉద్యోగం రావడంలేదని తీవ్ర డిప్రెషన్ కు లోనయిన అతడు గత ఆదివారం జమ్మికుంట రైల్వేస్టేషన్ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

ఈ నేపథ్యంలో షబ్బీర్ ఆదివారం ఉదయం రైలు కింద పడి చనిపోయాడని మృతుడి బంధువులకు రైల్వే పోలీసులు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న మృతుడి బంధువులకు షరీఫ్ జేబులో సూసైడ్ నోట్ లభ్యమైంది. దీంతో మృతదేహాన్ని తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు మృతుడి బంధువులు.  కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!