
పెద్దపల్లి : మూగ ప్రాణులంటే చాలామందికి ఎంతో ప్రేమ.. వాటికోం కొన్నిసార్లు తమ ప్రాణాల్నీ ఫణంగా పెడుతుంటారు. పెంపుడు పిల్లులు, కుక్కల పట్ల వాటి యజమానులు చూపించే ప్రేమ వెలకట్టలేనిదిగా ఉంటుంది. ఒక్కోసారి వాటి వల్ల యజమాని ప్రాణాలు ప్రమాదంలో పడిన సంఘటనలూ కనిపిస్తాయి. ఇలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో ఒకటి చోటుచేసుకుంది. ఓ మహిళ పెంచుకుంటున్న పెంపుడు పిల్లి పెరట్లో ఉన్న బావిలో పడింది.
దానిని ఎలాగైనా బావిలో నుంచి కాపాడాలనుంది. ఆ ప్రయత్నంలో పట్టు తప్పి ఆమె కూడా బావిలో పడిపోయింది. దీంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కిష్టం పల్లి లో సోమవారం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు, కుటుంబసభ్యులు ఈ మేరకు వివరాలను తెలియజేశారు.. కిష్టంపల్లిలో ఉండే లింగాల లసుము (55) ఓ పిల్లిని గారాబంగా పెంచుకుంటుంది.సోమవారం తెల్లవారుజామున ఆ పిల్లి ఎలా వెళ్లిందో తెలియదు కానీ ఇంటి ఆవరణలో ఉన్న చేదబావిలో పడిపోయింది.
ప్రేమించి, గర్భవతిని చేసి.. పెళ్లి చేసుకోమంటే.. అడవిలోకి తీసుకెళ్లి అతడు చేసిన పని..
కాసేపటికి పిల్లి కనిపించడం లేదని వెతికిన లసుముకు బావిలో నుంచి పిల్లి అరుపులు వినిపించడంతో వెళ్లి చూసింది. బొక్కెన సహాయంతో పిల్లిని బావిలో నుంచి బయటికి తీసుకురావాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె పట్టుతప్పి.. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఇది గమనించిన ఆమె చిన్న కొడుకు రాకేష్.. స్థానికులకు విషయం తెలిపాడు. వారి సహాయంతో బావిలో నుంచి తల్లిని బయటికి తీశారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షేక్ మస్తాన్ తెలిపారు.