
ఓ మహిళ... ప్రియుడితో కలిసి భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. ప్రియుడి మోజులో పడి... భర్త, బిడ్డలను దూరం పెట్టింది. భర్త ఉన్నంతకాలం తాను ప్రియుడితో సంతోషంగా ఉండలేనని భావించి... మద్యం మత్తులో ప్రియుడితో కలిసి ఏకంగా భర్తను హతమార్చింది. తర్వాత శవాన్ని గోదారి ఇసుక మేట్లలో పూడ్చి పెట్టింది. కాగా.. భర్త చనిపోయిన దాదాపు నెల రోజుల తర్వాత.. ఈ హత్య ఉదంతం బయట పడటం గమనార్హం. ఈ సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టేకులపల్లి మండలంలోని బిల్లుడుతండా పంచాయతీ పానుగోతుతండాకు చెందిన అజ్మీరా రాము(35)కు మూడు తండాకు చెందిన లలిత తో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. భార్యభర్తలిద్దరూ మేకల వ్యాపారం చేస్తుంటారు.
వీరికి ఎర్రుపాలెం మండలం అమ్మవారిగూడేనికి చెందిన కంసాని కృష్ణ తో మేకల వ్యాపారం ద్వారా పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త... లలితకు కృష్ణ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త రాముకి తెలియడంతో దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో.. భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది.
గత నెల 15వ తేదీన పిల్లలను ఈట్యాతండాలోని వారి బంధువుల ఇంటికి పంపించింది. అనంతరం ప్రియుడు కృష్ణను ఇంటికి పిలిచింది. అనంతరం ప్లాన్ ప్రకారం... రాముని లలిత, కృష్ణలు భద్రాచలం తీసుకువెళ్లారు.
అక్కడ ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత మద్యం మత్తులో ప్రియుడితో కలిసి రాము గొంతు పిసికి.. లలిత చంపేయడం గమనార్హం. అనంతరం శవాన్ని ఇసుకలో పాతిపెట్టారు. అనంతరం తనకు ఏమీ తెలియదు అన్నట్లుగా... ఇంటికి చేరింది.
పది రోజుల తర్వాత తన ఇద్దరు బిడ్డలను తీసుకొని ప్రియుడికి ఇంటికి చేరింది. ఇంట్లో ఎవరూ ఉండకపోవడంతో అనుమానం వచ్చిన రాము తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందతులు నిజాన్ని అంగీకరించడంతో.. వారిని రిమాండ్ కి తరలించారు.