ఆర్టీసీ బస్సులో ఓ మహిళ విచిత్రంగా ప్రవర్తించింది. బట్టలూడదీసుకుంటూ, తన కూతుర్ని కిటికీలోంచి విసిరేసి.. హల్ చల్ చేసింది. దీంతో కండక్టర్, డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ : hyderabadలో rtc busలో గురువారం ఓ మహిళా హల్ చల్ చేసింది. తోటి ప్రయాణికులను కొట్టి, తన మూడేళ్ల కూతురును బస్సు నుంచి కిందికి విసిరేసింది. ఆందోళన చెందిన బస్సు డ్రైవర్, కండక్టర్ మలక్ పేట పోలీసులను ఆశ్రయించారు. కండక్టర్, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. 37ఏళ్ల వయసు కలిగిన వివాహిత తన మూడేళ్ల కూతురుతో.. తన ఇంటికి వెళ్ళడానికి అఫ్జల్ గంజ్ లో రాత్రి 7 గంటలకు హయత్నగర్-2 డిపోకు చెందిన బస్సు ఎక్కింది. అక్కడ నుంచి ఎల్బీనగర్ కు టికెట్ తీసుకుంది. అఫ్జల్ గంజ్ నుంచి బస్సు బయలుదేరి వస్తుండగా.. ఎంజీబీఎస్ కి రాగానే ఆమె బస్సులో గొడవ చేయడం మొదలుపెట్టింది.
బట్టలు ఊడదీసుకోవడం, పక్కన ఉన్నవారిని దూషించడం చేసింది. కండక్టర్ వారించబోగా అతడిపై కూడా చేయి చేసుకుంది. ఎన్టీఆర్ నగర్ వెళ్ళడానికి మలక్పేటలో 60 సంవత్సరాల ఓ మహిళ బస్సు ఎక్కింది. అప్పటికే విచిత్రంగా ప్రవర్తిస్తున్న మహిళ పక్కనున్న సీటు ఖాళీగా ఉండడంతో అందులో కూర్చుంది. అంతే ఆ మహిళమీద కూడా కోపానికి వచ్చి.. ఆమెను కూడా కొట్టింది. ఆ తరువాత తన కుమార్తెను బస్సు కిటికీ నుంచి విసిరి వేయడానికి ప్రయత్నించింది. అది చూసిన ప్రయాణికులు అడ్డుకున్నారు. దీంతో బస్సు డ్రైవర్ మలక్ పేట పిఎస్ ఎదురుగా బస్సు ఆపాడు.
ఆ సమయంలో బస్సు డోర్ నుంచి పాపను కిందికి విసిరేసింది. తానూ బస్సు దిగి.. బస్సు టైర్ల కింద కూర్చుంది. అదృష్టవశాత్తు పాపకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆమె చేష్టలు చూసి హడలెత్తి పోయిన కండక్టర్, డ్రైవర్లు పోలీసులకు ఈ విషయం చెప్పారు. ఆ మహిళ అప్పటికి కూడా బస్సును కదలనీయకుండా బస్సు టైర్లను ఆనుకుని కూర్చుంది. మహిళా పోలీసులు, కొందరు స్థానిక యువతులు ఆమె దగ్గరికి వచ్చి నచ్చజెప్పి దుస్తులు తొడిగి ఆమెను, పాపను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆ మహిళ వివరాలు అడిగి తెలుసుకుని సరూర్ నగర్ లో ఉండే ఆమె అక్కకు అప్పగించారు. అయితే ఆమెకు మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే అప్పుడప్పుడు ఇలా ప్రవర్తిస్తోందని కుటుంబసభ్యులు తెలిపారు.