పటాన్‌చెరులో చిట్టీల పేరుతో ఘరానా మోసం.. డబ్బులతో ఉడాయించిన మహిళ.. న్యాయం చేయాలని కలెక్టరేట్‌కు బాధితులు

By Sumanth KanukulaFirst Published Sep 14, 2022, 12:46 PM IST
Highlights

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో చిట్టీల పేరుతో ఘరానా మోసం వెలుగుచూసింది. పలువురి వద్ద నుంచి దాదాపు రూ. 7 కోట్లు వసూలు చేసిన ఓ మహిళ ఆ డబ్బుతో ఉడాయించింది. 

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో చిట్టీల పేరుతో ఘరానా మోసం వెలుగుచూసింది. పలువురి వద్ద నుంచి దాదాపు రూ. 7 కోట్లు వసూలు చేసిన ఓ మహిళ ఆ డబ్బుతో ఉడాయించింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.. తమకు న్యాయం చేయాలంటూ నేడు సంగారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చారు. వివరాలు.. పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సాయిప్రియ కాలనీలో నివాసం ఉండే ఉమాదేవి కొంతకాలంగా చిట్టీల వ్యాపారం చేసింది. చుట్టుపక్కల వాళ్లతో స్నేహంగా ఉంటూ చిట్టీలు కట్టించింది. దీంతో చాలాకాలంగా ఉమాదేవి ఈ వ్యాపారం నిర్వహించడంతో.. చాలా మంది ఆమెను నమ్మి చిట్టీలు వేశారు.

ఉమాదేవి కొంత కాలంగా చిట్టీలు పూర్తైనా డబ్బులు చెల్లించడం లేదు. అయితే ఈ నెల 9వ తేదీన ఉమాదేవి రాత్రికి రాత్రే ఇంటి నుంచి ఉడాయించింది. బాధితులు డబ్బు కోసం ఉమాదేవి ఇంటికి రాగా తాళం వేసి కనిపించింది. మరోవైపు ఉమాదేవి సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ రావడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు.. పోలీసులను ఆశ్రయించారు. 

ఇక, తాజాగా న్యాయం చేయాలని కోరుతూ బాధితులు సంగారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చారు. దాదాపు రూ. 7 కోట్ల వరకు ఉమాదేవి తమను మోసం చేసిందని బాధితులు చెబుతున్నారు. అయితే బాధితుల్లో ఎక్కువ మంది రోజువారి కూలీలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు. 

click me!