అందువల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింది: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి రాహుల్ ల్యాప్‌టాప్‌లోని నోట్‌లో కీలక విషయాలు..

By Sumanth KanukulaFirst Published Sep 14, 2022, 12:15 PM IST
Highlights

సంగారెడ్డిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన రాహుల్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రాహుల్ ఆత్మహత్యకు గల కారణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 

సంగారెడ్డిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన రాహుల్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తానుంటున్న హాస్టల్ గదిలోనే అతడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే తన ల్యాప్‌ టాప్‌లో సూసైడ్ నోట్ ఉందని తెలిపే ఓ నోట్‌ను రాహుల్ గదిలో ఉంచారు. దీంతో పోలీసులు.. రాహుల్ ల్యాప్‌టాప్‌‌ను తెరిపించి అందులో సూసైడ్ నోట్‌‌ను కనుగొన్నారు. దీంతో రాహుల్ ఆత్మహత్యకు గల కారణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్లేస్‌మెంట్, థీసిస్ ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా రాహుల్ పేర్కొన్నాడు. 

‘‘ప్లేస్‌మెంట్ ఒత్తిడి, థీసిస్, భవిష్యత్తులో ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలతో.. నేను జీవించడానికి ఆసక్తి చూపడం లేదు. నేను సాధారణ జీవితాన్ని గడపాలనుకుంటున్నాను.. కానీ ఇప్పుడు అది రాబోయే సంవత్సరాల్లో పోరాటంగా అనిపిస్తుంది. ఐఐటీలో చేరేందుకు గేట్‌ని క్రాక్ చేయడానికి నేను బీటెక్‌లో సృష్టించుకున్న ఆత్మవిశ్వాసం.. ఆన్‌లైన్ తరగతుల వల్ల దెబ్బతింది. నాపై నాకు నమ్మకం పోతుంది. ఇక్కడ ప్రతిరోజూ నేను ఒత్తిడిని అనుభవిస్తున్నాను.

ఎక్కువ మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్ల కోసం ఎంటెక్‌లో చేరుతారు. అప్పుడు థీసిస్ ఎందుకు? ట్రిపుల్ ఐటీ బెంగళూరు వంటి కళాశాలలు థీసిస్‌కు బదులు ఇంటర్న్‌షిప్ వంటి ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయి. థీసిస్ కోసం ఏ విద్యార్థినీ ఒత్తిడి చేయవద్దు. నా నిర్ణయానికి గైడ్ కారణం కాదు.. కేవలం భవిష్యత్తు మీద భయం మాత్రమే. ఒత్తిడి నుంచి బయటపడేందుకు స్మోకింగ్, డ్రికింగ్‌క అలవాడుపడ్డాను. ఒత్తిడిని జయించలేకపోతున్నాను. 2019లో జరిగిన మూడు ఆత్మహత్యల ఘటన ఐఐటీ ఏమీ నేర్చుకోలేదు’’ అని రాహుల్ పేర్కొన్నాడు. రూ. 12,000 స్టైఫండ్‌ను సక్రమంగా చెల్లించలేదని కూడా ఆరోపించాడు. 

సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రమణ కుమార్.. రాహుల్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి విచారణలో తేలిన విషయాలను వివరించారు. రాహుల్ మృతి ఆత్మహత్య కారణంగానే జరిగిందని ప్రకటించారు.

click me!