
మహబూబ్ నగర్ : మహబూబ్నగర్లో ఓ ఘటన భయాందోళనలు కలిగించింది. ఓ విద్యార్థిని ఒంటరిగా ఆడుకుంటుండగా ఆశా వర్కర్ వేషధారణలో వచ్చిన ఓ మహిళ ఆమెకు సూది మంది ఇచ్చి పరారయింది. ఆ చిన్నారి పాఠశాల ఆవరణలో ఒంటరిగా ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. సోమవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనలో ఆమె ఎవరో, ఎందుకు సూది మందు ఇచ్చిందో ఇంకా తెలియలేదు. నవాబ్ పేట మండలం పుట్టోనిపల్లి తండాలోని ప్రాథమిక పాఠశాలలో అనన్య అనే చిన్నారి నాలుగో తరగతి చదువుకుంటుంది. ఆమె తల్లిదండ్రులు లక్ష్మణ్ నాయక్, అలివేలు. ఈ ఘటనకు సంబంధించి వీరు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఈనెల తొమ్మిదవ తేదీన సాయంత్రం అనన్య స్కూల్ దగ్గర ఒక్కతే ఆడుకుంటుంది. ఓ మహిళ అక్కడికి వచ్చింది. ఆమె ఆశా వర్కర్ల కనిపించింది. అనన్య దగ్గర నుంచి స్కూల్ బ్యాగ్ తీసుకోవడానికి ప్రయత్నించింది. అయితే అనన్య తన బ్యాగు తనకి ఇమ్మంటూ ఏడవడంతో ఆ మహిళ అనన్య చెంపమీద కొట్టింది. ఆ తర్వాత అనన్య కుడి చేతికి ఇంజక్షన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మీరు అద్భుతం, లవ్ యూ కేసీఆర్ గారూ... బండ్ల గణేష్ వరుస ట్వీట్లు.. ఎందుకంటే..
దీంతో చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది. తల్లిదండ్రులు ఏమిటని ప్రశ్నించగా.. తనకు ఆశా వర్కర్ ఇంజెక్షన్ ఇచ్చిందని.. బ్యాగు తీసుకు వెళ్ళడానికి ప్రయత్నించిందని చెప్పింది. దీంతో వారు గ్రామంలోని ఆశా వర్కర్ల అందరినీ ఆరా తీశారు. అయితే వారెవరు ఆ పని చేసింది తాము కాదని చెప్పారు. తమ ఎలాంటి సూది మందులు ఇవ్వడం లేదని చెప్పారు. అయితే, ఇంజక్షన్ ఇచ్చిన తెల్లవారి విద్యార్థిని అనారోగ్యానికి గురయ్యింది. దీంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు.
అప్పటికే ఇంజక్షన్ ఇచ్చి ఉండడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చిన్నారిని తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు చిన్నారిని పరీక్షించి.. బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అయిందని తెలిపారు.. దానికి చికిత్స చేశారు. ఆ తర్వాత చిన్నారిని డిశ్చార్జ్ చేయగా ఇంటికి తీసుకువెళ్లారు. కానీ రెండు రోజుల తేడాతో సోమవారం మళ్లీ చిన్నారి అస్వస్థతకు గురయింది. దీంతో వెంటనే మహబూబ్నగర్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. అక్కడ మళ్ళీ చికిత్స అందించారు.
అయితే, ఇది ఎవరో కావాలనే చేశారని అనుమానించిన తల్లిదండ్రులు వెంటనే ఈ ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ పురుషోత్తం దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలిపారు.