
హైదరాబాద్ : సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. ఈ మేరకు పొగుడుతూ వరుస ట్వీట్లు చేశారు. యాదాద్రి ఆలయం చూశాక.. రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా అద్భుతమైన ప్రగతి పదం వైపు నడిపే సత్తా ఉన్న నాయకుడని పూర్తిగా నమ్ముతున్నానంటూ పొగడ్తలతో ముంచేత్తారు. తన ట్వీట్లను తెలంగాణ సీఎంవోకు ట్యాగ్ చేశారు.
తాను ఈ ట్వీట్లు.. ఏ స్వార్థం కోసమో.. లబ్ధి కోసమో, ప్రయోజనం ఆశించో చేయడం లేదని మరో ట్వీట్ చేశారు. ఆలయాన్ని చూశాక నా మనసులోని మాటలు చెప్పాలనిపించింది అందుకే చెబుతున్నానన్నారు. ఇంకా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘మంచి చేస్తే మంచి అని చెబుతాను. లేకపోతే మౌనంగా ఉండిపోతాను. అది నా నైజం సార్.. మీరు అద్భుతం, యువర్ ఏ వండర్ ఫుల్, యువర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యూ కేసీఆర్ గారూ’ అంటూ వ్యాఖ్యానించారు.
2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు :కోమటిరెడ్డి సంచలనం
దేశంలో అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణ నెంబర్ వన్ గా ఎదగడంలో కేసీఆర్ ఆలోచనా విధానం, కఠోర శ్రమ, ముక్కుసూటితనమే కారణమని.. అది ఆనందకరమైన విషయమని అన్నారు. తాను ఎన్నో రోజుల నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నానని.. అయితే కోరిక ఉన్నా.. ఆ స్వామివారి అనుగ్రహం లేకపోవడంతో తనకు రావటం కుదరలేదని చెప్పుకొచ్చారు. కానీ, మంగళవారం ఉదయంకుటుంబ సమేతంగా వచ్చి ఆ యాదగిరి నరసింహ స్వామి వారిని దర్శించుకోగలిగానని.. చాలా ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
యాదాద్రి నరసింహస్వామి వారి దర్శనం అయ్యాక ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు మా ముఖ్యమంత్రి అయిన మీపై ఉండాలని, మా ప్రజలందరి పైన ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. దేవాలయాన్ని చూశాక చాలా సంతోషం అనిపించిందన్నారు. దీనికి ముఖ్యమంత్రి గారు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు. ఇంత బాగా తీర్చిదిద్దినందుకు మీకు అభినందనలు తెలియజేయలేకుండా ఉండలేక పోతున్నానంటూ బండ్ల గణేష్ వరుస ట్వీట్లు చేశారు.