పక్కింటివారు తనను తిట్టినా భర్త పట్టించుకోలేదని మనస్తాపంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.
హైదరాబాద్ : చిన్న చిన్న విషయాలకి మనస్థాపం చెందడం.. బలవన్మరణాలకు పాల్పడడం నేటి కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా ఓ చిన్న విషయానికి మనస్థాపం చెంది ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఇంతకీ ఆమె మనస్థాపానికి కారణమైన విషయం ఏంటంటే.. పక్కింటి వారు తిట్టడం.. ఆ విషయాన్ని భర్త పట్టించుకోకపోవడం.. అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టుగా…వారు తిట్టినందుకు కాదు గానీ భర్త పట్టించుకోలేదని ఆమె మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాదులోని పటాన్చెరు ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించి ఎస్ఐ దుర్గయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రామచంద్రపురం బొంబాయి కాలనీకి చెందిన శిరీష (25)ను పటాన్ చెరువు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన గణేష్ ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ చిన్నారుల వయసు మూడున్నర ఏళ్లలోపే.
బీఆర్ఎస్‌పై పోరులో టీ బీజేపీ వెనకడుగు.. రివర్స్ అటాక్ మాటేమిటి?.. తెర వెనక ఏం జరిగింది..?
ఆదివారం సాయంత్రం పక్కింటి పిల్లలతో శిరీష కూతురు పల్లవి ఆడుకుంటోంది. ఆ సమయంలో పిల్లల మధ్య గొడవ జరిగింది. దీంతో పక్కింటి వారు శిరీషను తిట్టారు. కోపానికి వచ్చిన శిరీష వెంటనే భర్త గణేష్ కు ఫోన్ చేసి ఈ విషయం తెలిపింది. అతను తర్వాత చూద్దాంలే అని పెట్టేశాడు. రాత్రి భర్త ఇంటికి వచ్చాడు. అతడు వచ్చేరాగానే తనను ఎందుకు తిట్టారో పక్కింటి వారిని అడగవా అంటూ శిరీష భర్తతో గొడవకు దిగింది.
ఆ తర్వాత తనను ఎవరు తిట్టినా పట్టించుకోవు అంటూ జూన్ 5వ తేదీ రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. అయితే శిరీష తల్లి.. శిరీష మృతి మీద అనుమానం వద్దంటూ పటాన్చెరువు ఠాణాలో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.