
మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేస్తున్న ఓ భర్తకు భార్య దేహశుద్ధి చేసింది. సోమవారం కామారెడ్డి అశోక్ నగర్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
యాదాద్రి జిల్లా ముఠా కొండూరు మండలం చేర్యాలకు చెందిన పరశురాం బోర్ వెల్స్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతను భార్య ధనలక్ష్మి, ఇద్దరు కూతుర్లతో హైదరాబాద్ లో నివసిస్తుంటాడు.
పరశురాం బోర్ వెల్స్ వ్యాపారం మీద అన్ని ప్రాంతాలకు తిరుగుతుంటాడు. ఈ సారి వెళ్లిన పరశురాం మూడు నెలల వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యలుకు అనుమానం వచ్చింది.
ఆరా తీయగా కామారెడ్డిలో ఉన్నాడని తెలిసింది. అక్కడ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడని తేలింది. దీంతో మండిపోయిన మొదటి భార్య బంధువులతో కలిసి కామారెడ్డికి వచ్చింది.
ఇల్లు కనిపెట్టి పరశురాంకు దేహశుద్ధి చేసింది. బంధువులూ తలో చేయి వేశారు. పరశురాంను తనవెంట తీసుకువెళ్లింది. అయితే రెండో భార్య కవిత మాట్లాడుతూ.. తనకు పెళ్లైన సంగతి చెప్పకుండా మోసం చేశాడని ఆరోపించింది.